parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.వందకోట్ల టీకాలు: సంబరాలు చేసుకోవాలా? || పరకాలమ్ -4

13-11-2021published_dt 2021-11-13T07:09:45.424Z13-11-2021 12:39:45 IST
Updated On 13-11-2021 15:19:35 ISTmodified_dt 2021-11-13T09:49:35.548ZUpdated On 13-11-20212021-11-13T07:09:45.424Z13-11-2021 2021-11-13T07:09:45.424Z - 2021-11-13T09:49:35.548Z - 13-11-2021

నమస్తే.

పరకాలమ్ కు స్వాగతం.

అక్టోబర్ 21 వ తేదీ నాటికి మన దేశంలో వంద కోట్ల మందికి కోవిడ్ టీకా వేసారు. ఆ వందవ కోటి టీకా వేయించుకున్న వ్యక్తి ప్రధాన మంత్రి లోక్ సభ నియోజకవర్గం వారణాసికి చెందిన వారు. ఢిల్లీలోని ఒక ఆసుపత్రి లో ఆ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ప్రధాన మంత్రి అక్కడే ఉన్నారు. వందకోట్ల మందికి టీకా వేసిన సందర్భంగా తన ప్రభుత్వ విజయాన్ని చాటుతూ ప్రధాని ఒక ప్రముఖ ఇంగ్లీషు దిన పత్రికలో వ్యాసం కూడా రాసారు. ఈ విషయం మీద ఆయన దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. మొన్న ఆదివారం ఆయన చేసిన మన్ కి బాత్ ప్రసంగంలో కూడా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. మీరు narendramodi.in కి వెడితే వీటన్నింటినీ అక్కడ చూడొచ్చు. ఈ సందర్భాన్ని ఒక పెద్ద సంబరంగా జరపడానికి మోదీ ప్రభుత్వం ముందస్తుగానే సకల సన్నాహాలూ చేసింది. ఒక పాట రాయించారు, ప్రముఖ గాయకునితో దాన్ని పాడించారు. దేశవ్యాప్తంగా వంద చారిత్రక కట్టడాలను మువ్వన్నెల విద్యుద్దీపాలతో అలంకరించారు. భారత్ ను ప్రశంసిస్తూ అనేక దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల అధిపతులూ సందేశాలు పంపించారు. బిల్ గేట్స్ ఒక దినపత్రికలో కాలమ్ రాసారు. బీజేపీ ముఖ్యమంత్రి ఒకరు ఒక ఫైనాన్షియల్ పత్రికలో వ్యాసం రాసారు. టీకా కార్యక్రమాలను పర్యవేక్షించే నీతి ఆయోగ్ సభ్యుడు కూడా ఈ విజయాన్ని ప్రశంసిస్తూ ఒక కాలమ్ రాసారు. దేశమంతటా పత్రికలు బీజేపీ మంత్రుల, నాయకుల ప్రకటనలతో నిండిపోయాయి. ఈ సంఘటనను పొగుడుతూ వారు పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వరదలై పారాయి. దేశం నలుమూలలా గ్రామాలలో, పట్టణ ప్రాంత ఇలాకాల్లో అధికార పార్టీకి చెందిన చిన్న చితకా నాయకులు వేలాది సంబరాలను నిర్వహించారు. దీని గురించి ఈనెల 21 నుంచి మొన్న ఆదివారం 24 వ తేదీ వరకూ వరుసగా నాలుగు పగళ్ళూ నాలుగు రాత్రుళ్ళు పత్రికలూ, టీవీ ఛానెళ్ళూ హోరెత్తించేసాయి. సోషల్ మీడియా లో కూడా ఇదే ఆ నాలుగు రోజులూ బాగా ట్రెండ్ అయిన అంశం.

ఇంత పెద్ద ఎత్తున ఈ జరిగిన ఈ సంబరాలలో ఇమిడి ఉన్న సందేశం ఏమిటి? అది ఏమి వెల్లడిస్తోంది, ఏమి దాస్తోంది? వంద కోట్ల టీకాలు వెయ్యడం అంత పెద్ద ఘనకార్యంగా మోదీ ప్రభుత్వం భావించి ఆర్భాటం చెయ్యడం వెనుక అర్థమేమిటి? దీనికి ఇంత హడావిడి చేసిందంటే ప్రభుత్వం మన లాంటి పౌరుల్ని ఎలా అంచనా వేస్తున్నట్లు లెక్క? ఇవాళ ఈ విషయాల మీద దృష్టి సారిద్దాం.

నిజానికి వంద కోట్లంటే మాటలు కాదు. చాలా పెద్ద సంఖ్యే. వంద కోట్ల కోవిడ్ టీకాలు వెయ్యడం ఒక మైలు రాయి అనే చెప్పాలి. అయితే, అది అంత వరకే, ఒక మైలు రాయి మాత్రమే. అంతకంటే ఎక్కువ కాదు. ఇండియా వంటి దేశానికి అదొక పెద్ద లక్ష్యంగా భావించాలా? భారత దేశం అమాత్రాన్నే ఒక బృహత్తర లక్ష్యంగా భావించాల్సిన ఒక మామూలు దేశంగా ఊహిద్దామా? మన జాతికి ఆ లక్ష్యం అంత ఉన్నతమైనది అని అనుకోవాలా? కనీసం నాలుగు దశాబ్దాలుగా అనేక రకాలైన టీకాలను విజయవంతంగా ఇస్తూ వస్తున్న దేశం మనది. టీకా ఉత్పత్తిలో ప్రపంచానికే కేంద్రం మనదేశం. ప్రపంచంలో సాటిలేని సాఫ్ట్ వేర్ దిగ్గజం మన దేశం. ఇంత విశిష్టత గల దేశానికి వంద కోట్ల టీకాలను వెయ్యడం అంత సమున్నత లక్ష్యంగా భావించాలా? ఒక మామూలు లక్ష్యాన్ని ఎంతో కష్ట సాధ్యమైనదిగా అభివర్ణించి, దాన్ని మేము గాబట్టి సాధించాము అని ప్రభుత్వం స్వయంగా గొప్పలు చెప్పుకోవడం అవసరమా? ప్రపంచంలో మనమెవ్వరికీ తీసిపోలేదని మనకి మనమే సర్టిఫికెట్ ఇచ్చేసుకోవడం ఎబ్బెట్టుగా లేదూ? ఇతరదేశాల మెప్పు పొందడం కోసం ఈ వెంపర్లాట ఏమిటి? పదేళ్ళ క్రితం కూడా లేని ఈ చిన్న పిల్లాడి మనస్తత్వం అకస్మాత్తుగా మనల్నెందుకు ఆవహించింది? ఎక్కణ్ణించి దాపురించింది ఈ మానసిక దౌర్బల్యం?

ప్రధాని రాసిన వ్యాసంలో తన లక్ష్యాన్ని ఆయన ఎంత గంభీరంగా అభివర్ణించారో చూస్తే నేను చెప్పదలచుకున్నది మీకు సులువుగా అర్థం అవుతుంది. ఒక వియాల్ టీకా, ఉత్పత్తి కేంద్రం నుంచి టీకా వేసే కేంద్రం వరకూ ఏ విధం గా ప్రయాణం చేస్తుందో దూరభారాలకు సంబంధించిన అన్ని వివరాలనూ ప్రధాని ఆ వ్యాసం లో రాసుకొచ్చారు. అదెంత పెద్ద వ్యవహారమో మనకి నచ్చ చెప్పడానికి వందకోట్ల టీకాలు వెయ్యడానికి ఎంత టైము పడుతుందో కూడా వివరించారు. ఆయన ఏమని రాసారంటే,

"ఒక ఆరోగ్య కార్యకర్త ఒక టీకా ఇవ్వడానికి రెండు నిముషాలు పడుతుందని అనుకుందాం. ఈ మహోన్నత లక్ష్యం చేరడానికి 41 లక్షల పని దినాలు - man days - అంటే పదకొండు వేల పని సంవత్సరాలు - man years - పట్టి ఉంటుంది."

అయితే, ఇది ఏవస్తువైనా ఉత్పత్తి కేంద్రం నుంచి వినియోగదారునికి సరఫరా అవ్వడానికి సాధారణంగా తీసుకునే సమయమే కదా! దీన్ని ఇంత గొప్పగా చెప్పుకోవాలా? కానీ ప్రధాని, అధికార పార్టీ అధినేత అలా చెప్పుకోవాలని అనుకున్నారు. ఇటువంటి బృహత్తర లక్ష్యాలను సాధించడం మన దేశానికేమీ కొత్త కాదన్న విషయం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ఈ ఇద్దరు నాయకులూ అనుకోలేదు.

ప్రధాని రాసిన రోజే, అదే పత్రికలో బిల్ గేట్స్ కూడా వ్యాసం రాసారు. ఆయన ఏమని రాసారో చూడండి:

"ఎన్నో రోగనిరోధక టీకాలను పెద్ద ఎత్తున ప్రజలకు జయప్రదంగా ఇచ్చిన సుదీర్ఘమైన గత అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని, యంత్రాంగాన్ని భారత్ సద్వినియోగం చేసుకుంది."

ఇంకా ఇలా రాసారు:

"ఇండియాలో అమలు చేసిన 'అందరికీ రోగనిరోధక టీకాలు ఇచ్చే కార్యక్రమం - universal immunisation proramme - ప్రపంచంలో అత్యంత విస్తారమైన ప్రజారోగ్య కార్యక్రమాలలో ఒకటి. ప్రతి సంవత్సరం అప్పుడే పుట్టిన 2.7 కోట్ల మంది శిశువులకు ప్రాధమిక టీకా వేస్తారు. ఒకటి నుంచి అయిదేళ్ళ లోపు వయసు కలిగిన పది కోట్ల మంది పిల్లలకు బూస్టర్ డోసులు వేస్తారు. ఇండియాలో సుమారు 27 వేల శీతల గిడ్డంగులు ఉన్నాయి. పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థ నిర్మించేందుకు అనేక సంవత్సరాలుగా పెట్టుబడులు పెట్టి కృషి చేస్తున్నారని ఈ ఆశ్చర్యంగొలిపే అంకెలు తెలియజేస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి ప్రబలినప్పుడు ఈ వ్యస్థ కీలకమైన ఆదరువుగా నిలిచింది."

భారత్ లో టీకాలు వేసే సామర్ధ్యాన్ని గురించి గేట్స్ ఇలా అన్నారు:

"ఈ మహమ్మారి రాక మునుపే లక్షల మంది జీవితాలను భారత్ టీకాలు కలరా, న్యుమోనియా, అతిసార వంటి అంటు వ్యాధుల నుంచి రక్షించాయి."

భారత్ సామర్ధ్యం గురించి గేట్స్ చెపుతున్న విషయాలను మన ప్రధాని, అధికార పార్టీ పెద్దలు అంగీకరించడానికి ఇష్టపడడం లేదన్నది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం.

ప్రధాని తన వ్యాసంలో, ప్రసంగం లో చిన్న చిన్న అవరోధాలను, కల్పితమైన సవాళ్ళను ప్రస్తావించారు. వాటిని తన ప్రభుత్వం శక్తివంతమైనది కాబట్టి అధిగమించ గలిగిందని చెప్పుకొచ్చారు. ఉదాహరణకి, టీకాలు వేసే కార్యక్రమంలో వీ ఐ పీ సంస్కృతి లేకుండా చేసామని ఆయన అన్నారు. ఇది వాస్తవం కాదని మనందరికీ తెలుసు. వీ ఐ పీ లు, తాము ప్రత్యేక హోదా కలిగిన వారమని భావించే ఇతరులు, వీరు ఎవ్వరూ తాము టీకా వేయించుకోడానికి క్యూలో నుంచో లేదు. ఇది నాకు స్వయంగా తెలిసిన విషయం. వారు నేరుగా టీకాల కేంద్రానికి వెళ్ళారు. టీకాలు వేయించుకుని రెండు నిముషాలలో బయటకు వచ్చేసారు. ఇది టీకాలు ఉచితంగా వేసే కేంద్రాల సంగతి. డబ్బులు వసూలు చేసి టీకాలు వేసే కేంద్రాలలో టీకాలు చిటుక్కున వేయించుకున్న వారు మనందరికీ తెలుసు. ఇక ప్రధాని వంద కోట్ల టీకాలు ఉచితంగా వేసామని చెప్పారు. ఇది పచ్చి అబద్ధం. దేశంలో వేసిన మొత్తం టీకాలలో కనీసం 25 శాతం డబ్బులు చెల్లించి వేయించుకున్నవే. ప్రధాని చెప్పిన మరో అవాస్తవం ఇక్కడ చెప్పాలి. ఆయన ఏమన్నారంటే:

"నిత్యం వాడుకునే వస్తువులు కూడా విదేశీ బ్రాండ్లనే ఎంచుకునే వారు మనలో కొందరున్నారు."

ఇక్కడ మనలో కొందరు అని, ఆ తర్వాతి వాక్యంలో 'భారత ప్రజలు' అంటూ మాట్లాడారు. ఆయన అన్న మాటలు ఇవి:

"అయితే, కోవిడ్ టీకాల వంటి కీలకమైన అంశానికి వచ్చేసరికి భారత ప్రజలు made in india టీకాలనే విశ్వసించారు."

కాని వాస్తవం ఏమిటంటే భారత్ లో అత్యధికంగా వాడిన టీకా భారత్ లో తయారైన విదేశీ బ్రాండ్! కోవిషీల్డ్. అతి తక్కువగా వినియోగించిన టీకా ఇండియాలో తయారైన ఇండియా బ్రాండు. కోవేక్సీన్. విజయాల జాబితాకి ఈ బూటకపు విజయాన్ని కూడా జోడించారు. అనేక వ్యాధుల నివారణకు వినియోగించే టీకాలన్నీ భారత్ లో ఉత్పత్తి అయినవే. వీటిని దశాబ్దాలుగా భారత ప్రజలు విశ్వసిస్తున్నారన్నది కొత్త విషయమేమీ కాదు.

కోవిన్ పోర్టల్ గురించి ప్రధాని మాట్లాడారు. అక్కడికి అదేదో సమస్యలకు అతీతమైనదీ, అవాంతరాలు కలిగించనిదీ అయినట్టు. గ్రామీణ ప్రాంత ప్రజలు, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ సదుపాయాలు లేని వాళ్ళు ఈ పోర్టల్ తో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో మళ్ళీ నేను ఇక్కడ ప్రత్యేకంగా వివరించాల్సినపని లేదనుకుంటా. దీని మీద సుప్రీం కోర్టు చాల కటువైన వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత చాలా రోజులకి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అనే నిబంధనను సడలించారు. ప్రధాని రాసిన వ్యాసంలో మరో అంశాన్ని చూద్దాం. ఆయన ఇలా అన్నారు:

"ప్రపంచమంతటా కోవిడ్ స్వైరవిహారం చేస్తున్న 2020 సంవత్సరం ప్రధమార్ధం లో ఆ మహమ్మారితో ఎప్పటికైనా టీకాలతోనే పోరాడాలనే విషయం మనకు స్పష్టం గా అర్ధమయ్యింది. అందుచేత తొందరగానే మనం సంసిద్ధులం కావడం ప్రారంభించాం. 2020 ఏప్రిల్ నుంచే వ్యూహ రచన చేసాం. నిపుణుల బృందాలను ఏర్పాటు చేసాం."

కోవిడ్ మహమ్మారిని ఎప్పటికైనా టీకాల సాయంతోనే పోరాడాలని తెలుసునన్న ఆయన, బహుశః ఈ లోగా లైట్లు ఆర్పడం, దివ్వెలు వెలిగించడం, కంచాలను వాయించడం, చప్పట్లు కొట్టడం లాంటివి కూడ పనికొస్తాయేమోనని ఒకసారి ప్రయత్నించి ఉంటారు. ఆయన మంత్రిమండలి సభ్యులు, పార్టీ సహచరులు కూడా ఈ విషయంలో ఏమీ తగ్గలేదు. ఒక బ్రాండ్ అప్పడాలు తినడం, ఒక యోగా గురువు తయారుచేసిన లేహ్యాన్ని తీసుకోవడం, ఒంటి నిండా ఆవుపేడ పూకోవడం, ఆవు మూత్రం సేవించడం, మంత్రాలు జపించడం వల్ల తప్పనిసరిగా కోవిడ్ నయం అవుతుందని వారు ప్రచారం చేసారు.

మనం తొందరగా సంసిద్ధులం కావడం ప్రారంభించామని ప్రధాని రాసారు. కోబిడ్ సెకండ్ వేవ్ మనల్ని అతలాకుతలం చేసినపుడు మనం ఎంత నిస్సహాయంగా, అస్తవ్యస్తంగా ఉన్నామో మీకు గుర్తుండే ఉంటుంది. దేశంలో టీకాలు ఉత్పత్తి చేసే రెండు ప్రధాన సంస్థలకూ మన ప్రభుత్వం ముందస్తుగా ఒక్క పైసా ఇవ్వలేదు. ఏప్రిల్ నాటికి చాలా చిన్న ఆర్డర్ పెట్టింది. దేశంలో టీకాలు వేసుకునే వయసు గలిగిన వాళ్ళందరికీ టీకాలు వెయ్యాలంటే కనీసం 180 కోట్ల డోసులు కావాలని మనందరికీ తెలిసిన విషయం. కానీ ప్రభుత్వం మాత్రం సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కు 26 కోట్ల డోసులకు, భారత్ బయో టెక్ కు అయిదు కోట్ల డోసులకూ మాత్రమే ఏప్రిల్ నాటికి ఆర్డర్ పెట్టింది. అప్పటికే చాలా దేశాలు ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి కంపెనీలలో రిస్కు పెట్టుబడులను పెట్టాయి. గేట్స్ ఫౌండేషన్ పది కోట్ల డోసులకి సీరం ఇన్ స్టిట్యూట్ కు అడ్వాన్సుగా డబ్బుకూడా చెల్లించేసింది. ఇక పరిస్థితి చెయ్యిదాటి పోయాక మన ప్రభుత్వం మేల్కొని ఆ కంపెనీ ఇతర దేశాలకు పంపాల్సిన డోసులను అడ్డంకొట్టి అది ఉత్పత్తి చేసిన డోసులన్నీ మన వినియోగానికి బలవంతంగా మళ్ళించింది. మరి ప్రధాని ఉద్దేశం లో ముందస్తుగా సంసిద్ధులం కావడమంటే ఇదే కాబోలు! వాస్తవాల ఆధారంగా విధాన నిర్ణయాలు జరగకపోవడం పట్ల నిరసన, బాధ వ్యక్తం చేస్తూ కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు ఒకరు మే 2020 లో రాజీనామా చేసిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. దీన్ని బట్టి ప్రభుత్వం ఏర్పాటుచేసిన నిపుణుల బృందం ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు.

2020 జూన్ లో సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని కుదిపి లేపి మందలించిన తర్వాతనే టీకాల సేకరణ, న్యాయమైన ధరల నిర్ణయం కాస్తంత దారిలో పడ్డాయి. మొదట్లో కేంద్ర ప్రభుత్వం తాను 50 శాతం డోసులనే సేకరించాలనీ, పాతిక శాతం డోసులు రాష్ట్రాలు కొనుక్కోవాలని, తక్కిన పాతిక శాతం డోసులు ప్రైవేట్ రంగానికి కేటాయిస్తూ నిర్ణయించింది. రాష్ట్రాలు దిక్కుతోచక అటూఇటూ పరుగులు పెట్టాయి. గ్లోబల్ టెండర్లు పిలిచి భంగపడ్డాయి. మరో విషయం. దేశీయ ఉత్పత్తిదారుల నుంచి కేంద్ర ప్రభుత్వం డోసుకు నూట యాభై రూపాయలకే కొంటుంది. రాష్ట్రాలు మాత్రం కోవి షీల్డ్ కు మూడు వందల రూపాయలు, కోవాక్సీన్ కు ఆరు వందల రూపాయలు తమ సొంత నిధుల నుంచి కొనుగోలు చేయ్యాలట. అంతే కాదు. 45 సంవత్సరాల వయసు ఆ పైన వారికి, ఆరోగ్య రంగ కార్యకర్తలు - front line health workers - వారికి మాత్రమే టీకాలు వేసే బాధ్యత కేంద్రం తీసుకుంది. మిగతా వారి సంగతి తన బాధ్యత కాదంది. సుప్రీం కోర్టు ఒత్తిడి మేరకే 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు వారికి కూడా ఇచ్చేందుకు టీకా డోసులు సేకరించి రాష్ట్రాలకు సరఫరా చెయ్యాలని నిర్ణయించింది. అయితే కేంద్రం ఈ విషయాన్ని అంత సులువుగా ఒప్పుకోలేదు. సుప్రేం కోర్టులో తనకింతక్కువ ధర, రాష్ట్రాలకు ఎక్కువ ధర, తన పరిమితమైన బాధ్యత, వీటిని గట్టిగా సమర్ధించుకుంది. కోర్టు ససేమిరా అని తీవ్రమైన ఒత్తిడి చేసిన తర్వాతనే మనసు మార్చుకుంది.

దేశంలో టీకాల విషయంలో గందరగోళం జరిగిన నాటి దుర్భర దశను మనం గుర్తు చేసుకోకూడదని ప్రధాని,ఆయన ప్రభుత్వం కోరిక. కొత్తగా ఏర్పాటు చేసిన పీ ఎం కేర్స్ నిధి మతలబు ఏమిటో, దాని వివరాలు ఏమిటో చెప్పడానికి ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఆ విషయంలో ఏదో దాస్తోంది. టీకాల కోసం కేటాయించిన ముప్ఫై అయిదు వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టారో అజాపజా లేదు. అదీ దాస్తున్నారు. అక్టోబర్ 21 న జరిగిన మహా సంబరాలకంటే ముందు మరో చిన్న సంబరం ప్రభుత్వం చేసింది. అది సెప్టెంబర్ 17 న ఒకే రోజు రెండు కోట్ల మందికి టీకాలు వేసి ప్రధానికి జన్మదిన కానుకగా సమర్పించింది ప్రభుత్వం. దాన్ని కూడా సంబరం చేసారు. ఆ రోజుకు ముందూ, ఆ రోజు తర్వాతా చాల తక్కువ సంఖ్యలో టీకాలు వేసారనేది మనం గమనించ కూడదని ప్రభుత్వం కోరిక.

ప్రపంచం మొత్తం మీద ఏడు వందల కోట్ల డోసులు ఇస్తే, ఇండియా ఒక్కటే వంద కోట్ల టీకాలు వెయ్యగలిగిందంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఒక పత్రికలో రాసిన వ్యాసంలో గొప్పగా చెప్పుకొచ్చారు. సరే, మనం కాకుండా చైనా తప్ప, మరే దేశంలోనూ వంద కోట్ల టీకాలు వెయ్యల్సిన అవసరం లేదనే విషయాన్ని మన నుంచి మరుగున పెట్టాలని ఆయన ఆయన ప్రయత్నం. ఉదాహరణకు అమెరికా తీసుకోండి. ఆ దేశం లో టీకాలు వేయించుకునే వయసులో ఉన్నవారందరికీ రెండు డోసులు ఇచ్చి, ఆ పై మరో డోసు, మూడోది, బూస్టర్ డోసు ఇచ్చినా కూడా వంద కోట్ల డోసులు అవసరం లేదు. ప్రపంచం లోని మిగతా ప్రతి దేశం పరిస్థితీ అదే. దీనికి ఒకే ఒక దేశం మినహాయింపు. జనాభా లో మన దేశం తో పోల్చదగిన దేశం ఒక్క చైనా మాత్రమే. దాన్ని పరిశీలిద్దాం. చైనా వంద కోట్ల టీకాలు వెయ్యడం ఈ సంవత్సరం జూన్ నాటికి పూర్తి చేసింది. అంటే మనకంటే నాలుగు మాసాల ముందే. ఆగస్టు నాటికి రెండు కోట్ల డోసులు పూర్తి చేసింది. అంటే వంద కోట్ల డోసుల మైలు రాయి దాటిన రెండు నెలలకే రెండు వందల కోట్ల లక్ష్యాన్ని ఛేదించింది. మనం వంద కోట్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి రెందు మాసాల ముందే చైనా రెండు వందల కోట్ల డోసులు ఇచ్చింది.

 

కాని మన ప్రభుత్వాధినేతలు, అధికార పార్టీ నాయకులు మనల్ని తప్పుడు ఉదాహరణల వైపు చూడమంటారు. మనకన్న తక్కువ జనాభా ఉన్న దేశాలను గమనించ మంటారు. టీకాలు వేసుకున్న వారి సంఖ్య దేశ జనాభాలో ఇంత శాతమే అని ఎత్తి చూపించేవారి మీద అధికార పార్టీ అధ్యక్షులు కళ్ళెర్రజేస్తారు. మొత్తం టోకు సంఖ్య చూడాలని గద్దిస్తారు. కానీ చైనా గురించి, దాని అంకెల గురించీ ప్రధాని కాని, అధికార పార్టీ అధ్యక్షుడు కాని, ప్రభుత్వం లో పార్టీలో ఉన్న పెద్దలు కానీ నోరు మెదపరు. టోకు సంఖ్యలోను, శాతం లోనూ కూడా చైనా మనకంటే చాలా ముందంజలో ఉంది. ఆ దేశం 104 కోట్లమందికి, అంటే 75 శాతం జనాభాకి పూర్తిగా రెండు డోసుల టీకా ఇచ్చిందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ డాష్ బోర్డ్ తెలియజేస్తోంది. మనం ఇప్పటి వరకు కేవలం 28 కోట్ల మందికి మాత్రమే, అంటే అర్హులైన జనాభాలో 21 శాతం మందికే పూర్తి టీకాలు వేయించాం. మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే, రెండు వందల కోట్ల టీకాలు వేసి చైనా చడీ చప్పుడూ లేకుండా మౌనంగా, ఆత్మ విశ్వాసంతో ఉంది. హంగూ ఆర్భాటం చెయ్యడం లేదు. బడాయి పోవడం లేదు.

 

మనం సంబరాలు చేసుకోవాలని ప్రధాని, ప్రభుత్వము కోరుకుంటున్నారు. ప్రతి చిన్న విషయానికీ సంబరం చెయ్యమంటున్నారు. అంతే కాదు. మన సామూహిక జ్ఞాపకం నుంచి గతాన్ని చెరిపెయ్యమంటున్నారు. చెప్పుకోతగ్గది గతంలో ఏమీ లేదనీ, అంతా ఇప్పుడే జరుగుతోందనీ నమ్మమంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, ఉదాశీనతను, ముందస్తు తయారీ లేకపోవడాన్నీ, తడబాటును, సంక్షోభాన్ని గుర్తు చేస్తూ మాట్లాడే వారిని దుష్టులుగాను, ద్రోహులుగాను పరిగణిస్తున్నారు. నిన్న మొన్న జరిగిన విషాదాలు కూడా మరచి పోవాలట. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో జరిగిన విషయాలు సైతం మనం విస్మరించాలట. మనందరం, ఓ కుటుంబ సభ్యుణ్ణో, బంధువునో, మిత్రుడినో, తెలిసిన వారినో కోల్పోయామన్న వాస్తవాన్ని కూడా మనం గుర్తు పెట్టుకో కూడదట. ఆసుపత్రులలో పడకలు లేక, వెంటిలేటర్లు లేక, ఆక్సిజన్ లేక, సకాలం లో వైద్యం అందక వారంతా చనిపోయారనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవద్దంటారు. పవిత్ర గంగా నదిలో కొట్టుకొచ్చిన వందలాది కోవిడ్ మృతుల శవాల గురించి మర్చిపోవాలంటారు. మన నగరాల పేవ్ మెంట్ ల మీద శవాలు గుట్టలుగా పడి ఉన్న సంగతిని, అంత్యక్రియల కోసం శ్మశానాల వద్ద బారులు తీరిన శవాలను మన సామూహిక జ్ఞాపకాన్నించి చెరిపేసుకోమంటారు. ఒకచిన్న మైలు రాయిని ఘనాతిఘనమైన విజయంగా భావించి సంబరం చేసుకోమంటారు. మనం ఏడవకూడదు, సంతాపం ప్రకటించకూడదు, ఆగ్రహించకూడదు, నిరసన వ్యక్తం చేయకూడదు, వారిని లెక్క చెప్పమనకూడదు, సంజాయిషీ అడగ కూడదు. గతించిన విషాదాలను గుర్తుంచుకుని బాధ పడడం నకారాత్మకంగా, నెగెటివ్ గా ఆలోచించడమట. ఈ సంబరాలలో పాలు పంచుకుని దేశభక్తులనిపించుకోవాలట. అందువేత మనమందరం సంబరంచేసుకోవాలి, సకారాత్మకంగా, పాజిటివ్ గా ఆలోచించాలి, గతాన్ని వదిలేసి ముందుకు కదలాలి.

 

చిన్న చిన్న విషయాలకు కుడా సంబరాలు చేసుకోవాలని ఏ ప్రభుత్వం కోరుకుంటుంది? మామూలుగా సర్వసాధారణంగా జరిగే విషయాలను కూడా ఘన విజయాలుగా భావించి జయజయధ్వానాలు చెయ్యమని ఏ ప్రభుత్వం అడుగుతుంది? అసలైన, నిజమైన విజయాలు సాధించని ప్రభుత్వమే అలా కోరుకుంటుంది. గతాన్ని మనం మరచిపోవాలని ఏ ప్రభుత్వం కోరుకుంటుంది? ఆత్మ విశ్వాసం లేని, తన దక్షతమీద నమ్మకం లేని ప్రభుత్వమే ఆ విధంగా కోరుకుంటుంది. ఏ ప్రభుత్వం అబధ్ధాలు చెపుతుంది? నిజాలు దాచాల్సిన అగత్యం ఉన్న ప్రభుత్వమే అలా అబద్ధాలు ఆడుతుంది. ఇలాంటి మాయలూ, గమ్మత్తులు చేయడానికి ఎలాంటి ప్రభుత్వం తంటాలు పడుతుంది? పౌరులంటే చాలా చులకనైన అభిప్రాయం కలిగి, మసిపూసి మారేడుకాయ చేసినా వాళ్ళు తెలుసుకోలేని దద్దమ్మలు లే అని అనుకునే ప్రభుత్వం అలా ప్రయత్నిస్తుంది.

స్టాలిన్ గురించి ఒక మాస్కో వాసి నీనా పాబ్లజోవా ఇలా అన్నారు:

"అతను బాల్కనీలో నిలబడి అబద్ధాలు చెపుతాడు. ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడతారు. కానీ అతను అబద్ధం ఆడుతున్నాడని ప్రతి ఒక్కరికీ తెలుసు. వారికి తెలుసునని అతనికీ తెలుసు. అయినా అతను అబద్ధాలు చెపుతూనే పోతాడు. అందరూ అవి విని చప్పట్లు కొడుతున్నారని ఆయన సంతోషపడుతూనే ఉంటాడు."

మనమింకా ఆస్థాయికి చేరుకోలేదని నాకు నమ్మాలని ఉంది. ఆ దిశగా మనం ప్రయాణించడం లేదని కూడా నా ఆశాభావం.

 

ఇవాళ ఇక్కడితో ముగిస్తాను.

వచ్చే శనివారం ఉదయం తొమ్మిది గంటలకు

మళ్ళీ కలుసుకుందాం.

అప్పటి వరకు, శెలవు.

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin