parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.లఖింపూర్ ఘాతుకం: మోదీ, బీజెపీ ల 'మనసులో మాట' ఇదేనా? || పరకాలమ్ -2

22-10-2021published_dt 2021-10-22T13:08:56.757Z22-10-2021 18:38:56 IST
2021-10-22T13:08:56.757Z22-10-2021 2021-10-22T13:08:56.757Z - - 18-08-2022

లఖింపుర్ ఖెరీ లో దారుణ మారణ హోమం జరిగింది. ఎనిమిది మంది చనిపోయారు. వారిలో నలుగురు ఆందోళన వేస్తున్న  రైతులు. ఒక ఎస్ యూ వీ వాహనం వారిని తొక్కుకుంటూ వెళ్ళింది, దాని కిందపడి నలిగి నలుగురు రైతులు దుర్మరణం పాలయ్యారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రికి చెందిన వాహనం అది. ఆ ఘటన దరిమిలా జరిగిన హింసా కాండలో ఒక జర్నలిస్టూ, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు చనిపోయారు. లఖింపుర్ ఖేరీ లో జరిగిన ఈ ఘటనను మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అలాగే, ఎస్ యూ వీ వాహనం రైతులను తన టైర్ల కింద తొక్కుకుంటూ వెళ్ళిన ఘటనకు ముందూ, ఆ తర్వాతా జరిగిన సంఘటనలను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఘోరం ఏ నేపధ్యంలో జరిగిందో అర్థమంచేసుకోవాలంటే ఆ ఘటనలన్నింటినీ కలిపి పరిశీలించాలి. 

ఈ ఘటన మన రిపబ్లిక్ కి ఏ సందేశం ఇస్తోంది, మన ప్రజాస్వామ్య వ్యవస్థకూ, మనలాంటి సామాన్య ప్రజలకూ ఎలాంటి శకునాలను అందిస్తుందో అర్థమంచేసుకోవాలి. ఈ అంశాలను వివరించే ప్రయత్నం ఈ పూట చేస్తాను. 

లఖింపుర్ ఘటనలో ఏమి జరిగిందో ఒక్క సారి వెనక్కి తిరిగి చూద్దాం. కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు మొన్న మూడవ తారీకున లఖింపూర్ ఖేరీ పర్యటనలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి సమక్షం లో నిరసన తెలియజెయ్యడానికి ప్రదర్శనగా వెడుతున్నారు. వారి వెనకనుండి ఒక వాహనాల కాన్వాయ్ వచ్చి వారిని తొక్కుకుంటూ వెళ్ళిపోయింది. ఎనిమిది మంది చనిపోయారు, డజన్ల మంది గాయపడ్డారు. చనిపోయిన రైతుల శరీరాలమీద టైర్ల గుర్తులున్నాయి. వాహనాల కింద పడి వారు నలిగి చచ్చిపోయారు. ఆ కాన్వాయ్ లో ఒక ఎస్ యూ వీ ఉంది. అది కేంద్ర మంత్రినాజయ్ మిశ్రా కుమారుడిది. రైతులమీదినుంచి కారు ఎక్కించాక మంత్రి కుమారుడు కారు దిగిపోయి పొలాల్లోకి పరిగెత్తుకుంటూ పారిపోవడం చూసామని అక్కడి ఉన్న సాక్షులు చెపుతున్నారు. ఆశిష్ మిశ్రా ఆ ప్రాంతంలో బీజేపీ నాయకుడు. తండ్రికి వారసునిగా అక్కడి అసెంబ్లీ తికెట్ కూడా ఆశిస్తున్న వాడు. నిరసన కారుల మీదినుంచి కారు వెళ్ళిన తర్వాత హింసాకాండ మొదలయ్యింది. అందులో మరో నలుగురు మరణించారు. వారిలో ఒక వ్యక్తి జర్నలిస్టు. ముగ్గురు బీజేపీ మద్దతుదారులు, వారిలో ఒకరు అశిష్ మిశ్రా డ్రైవర్ అని భోగట్టా. 

ఘటన జరిగిన సుమారు ఆరు రోజులకు, అక్టోబర్ 9 వ తేదీ రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేసారు. అతని ఇంటి గేటుకి సమన్స్ నోటీసు అంటించినప్పటికీ ఆశీష్ మిశ్రా పోలీసుల ఎదుట హాజర్ కాలేదు. తన కుమారుడు అనారోగ్యంగా ఉన్నాడని, ఇంటిలోనే ఉన్నాడనీ, పరారీ అవ్వలేదనీ, అతని తండ్రి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చెప్పుకొచ్చాడు. ఈ సంఘటనను సుప్రీం కోర్టు సూమోటు గా విచారణకు స్వీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తిమధ్యక్షతన ధర్మాసనం యూపీ ప్రభుత్వం తరపున కోర్టులో హాజరైన న్యాయవాదిని మందలించింది. కోర్టు చేసిన వత్తిడి వల్ల ఆ మరుసటి రోజే ఆశిష్ మిశ్రా పోలీసులకు అందుబాటులోకి వచ్చాడు. పది గంటలకు పైగా ఆశిష్ ను ప్రశ్నించినట్టు పోలీసులు చెప్పుకొచ్చారు. అతను విచారణకు సహకరించడం లేదనీ, ఆయన సమాధానాలు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయనీ అతణ్ణి ప్రశ్నించిన సీనియర్ పోలీస్ అధికారి మీడియా ప్రతినిధులకు చెప్పారు. ఆశీష్ ను అప్పుడు పోలీసులు అరెస్టు చేసారు. కోర్టులో హాజరు పరచి 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరింత ప్రశ్నించడానికి, పోలీసుల అధీనంలో ఉండాలని కోర్టు ఆదేశించింది. 

ఇంతవరకూ జరిగిన సంఘటనల క్రమంలో కొన్ని యదార్ధాలను మనం విస్మరించకూడదు. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిని గమనించి ఆ తర్వాత ఈ ఘోర మారణకాండ జరగడానికి ముందూ, జరిగిన తర్వాతా ఏమయ్యిందో దాన్నంతటినీ కలిపి చూద్దాం. 

ఒకటి, హత్యలు జరిగిన ప్రదేశంలో ప్రతి ఒక్క సాక్షి ఆశిష్ మిశ్రాను నిందితుడంటున్నారు. అయితే యూపీ పోలీసులు మాత్రం అతణ్ణి నిందితునిగా కాకుండా కేవలం సాక్షిగానే పిలిచారు. రెండు, సమన్లను కేంద్రమంత్రి కొడుకు ఖాతరు చెయ్యకపోయినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. అతనికి ఆరోగ్యం బాగాలేదు కనుక పోలీసుల ఎదుట హాజరు కాలేడనీ, ఆరోగ్యం కిదుటపడ్డాక ఎప్పుడు కావాలంటే అప్పుడు వెడతాడనీ కేంద్ర మంత్రి అన్నారు. మూడు, అతన్ని కస్టడీ లోకి తీసుకునే సంకలపం పోలీసులకు లేదు. నాలుగు, సుప్రీం కోర్టు ఈ కేసును సూమోటు గా పరిగణనలోకి తీసుకుంది. అయిదు, నిందితుడు ఎంత పలుకుబడిగలవాడైనా, ఎంత ఉన్నతస్థాయిలో ఉన్నావాడైనా అతనిని అరెస్టు చేసి తీరాలన్న సుప్రీం కోర్టు కటువుగా అన్నప్పుడు మాత్రమే యూపీ ప్రభుత్వం తరపు న్యాయవాది సరేనని అంగీకరించారు. ఆరు, కోర్టు నుంచి అంత పెద్ద ఎత్తున వత్తిడి వచ్చిన తర్వాతనే ఆశిష్ ను పోలీసుల దగ్గరకి ఇంటరాగేషన్ కి పంపించారు. ఏడు, సర్వోన్నత న్యాయస్థానం నుంచి అంత ఒత్తిడి లేకపోయినట్లయితే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండూ ఈ మొత్తం వ్యవహారాన్ని కప్పిపుచ్చేసేవి, నీరు కార్చేసేవి. ఈ హత్యాకాండలో ఆశిష్ మిశ్రా ప్రమేయం గురించి అసలు విచారణే జరిగి ఉండేది కాదు.

ఎనిమిది, లఖింపూర్ ఖేరీ లో మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళకుండా ప్రతిపక్ష నాయకులను దారిలోనే అడ్డం కొట్టేసింది యూపీ ప్రభుత్వం. తొమ్మిది, ప్రతిపక్షాలు, ప్రజలు గగ్గోలు పెట్టి తీవ్ర ఒత్తిడ్ తెచ్చిన తర్వాతనే వారిని లఖింపూర్ లోకి అనుమతించారు. పది, ఆ ప్రాంతంలో ఇంటర్ నెట్ ను కట్ చేసి దేశంలో తక్కిన ప్రాంతాలతో అక్కడివాళ్ళకు సమాచార సంబంధాలు లేకుండా వేసారు. పదకొండు, తన కొడుకును ప్రశ్నిస్తున్న పోలీసులపై వత్తిడి తెచ్చేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఆ పోలీసు ఠాణా కి సమీపంలోనే మకాం వేసుక్కూర్చున్నాడు.

ఇక ఇప్పుడు ఈ ఘటనకు పూర్వం ఏం జరిగిందో జాగ్రత్తగా పరిశీలిద్దాం. లఖింపూర్ హత్యాకాండకు ముందు జరిగిన రెండు ఘటనలను మనం గమనం లో పెట్టుకుంటే దాని నేపధ్యం సవ్యం బోధపడుతుంది. ఒకటి, హత్యాకాండకు వారం రోజుల ముందే కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఆందోళన చేస్తున్న రైతులు తమ తీరు మార్చు కోవాలి, లేని పక్షంలో వారిని తానే సరిచేస్తాను అని ఆ సమావేశంలో హెచ్చరించారు. అనేక డిజిటల్ వేఇకలపై అజయ్ మిశ్రా ఈ ప్రకటన విస్తృతం గా తిరిగింది. రెండు, అజయ్ మిశ్రా ఈ ప్రకటన చేయడానికి కొద్ది రోజుల ముందు, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, ఆందోళన చేస్తున్న రైతులకు బుద్ధి చెప్పడానికి కార్యకర్తలు సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు. మూడు, రైతుల ఉద్యమాన్ని నక్సలైట్ల ఉద్యమంగా, వారిని ఖలిస్థానీయులుగా, దేశద్రోహులుగా బీజేపీ నాయకులు అభివర్ణించని రోజు లేదంటే అది అతిశయోక్తి కాదు. నాలుగు, మోదీ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి రైతులు విదేశీ శక్తుల ప్రేరణతో ఆందోళనకు దిగారనే నింద కూడా వారి మీద వేశారు. రైతు ఉద్యమం బలం గా ఉన్న పశ్చిమ యూపీ, హరియాణాల్లో తన సొంత శ్రేణుల బలాన్ని ప్రయోగించి ఉద్యమం నడ్డి విరగ్గోట్టాలనే నిర్ణయానికి బీజేపీ వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ మేరకు ఛోటా నాయకులు ఎవరైనా మాట్లాడి ఉండి ఉంటే మనం పెద్దగా పట్టించుకోనక్కర లేదు. కానీ, సాక్షాత్తు కేంద్ర మంత్రిమడలి లో సభ్యుడు, అందులోనూ దేశీయ వ్యవహారాల సహాయమంత్రీ, ఒక ముఖ్యమంత్రి స్థాయి వారు మాట్లాడినప్పుడు ఆ మాట బీజేపీ అంతరంగం అని అనుకోకుండా ఎలా ఉండగలం? వారు ఆ మాటలు మాట్లాడిన కొన్ని రోజులకే నిరసన ప్రదర్శనలోనున్న రైతుల దారుణ హత్య, పట్టపగలు, ప్రజలందరూ చూస్తూ ఉండగా జరిగింది. నిరసన చేపట్టిన రైతులతో తాము ఎలా వ్యవహరించదల్చుకున్నారో దానిని దాచిపెట్టే ప్రయత్నం బీజేపీ నాయకులు చెయ్యలేదు. రాజ్యాంగేతర పద్ధతులను వినియోగించి రైతాంగ ఉద్యమాన్ని అణగతొక్కెయ్యాలంటూ బహిరంగంగా ప్రకటించడం, వారిశ్రేణులు అలా చెయ్యడం, అలా మాట్లాడడం సరికాదనే స్పృహ కూడా రాజ్యాంగ బద్ధం గా నడుచుకోవలసిన ముఖ్యమంత్రికీ, కేంద్ర మంత్రికీ లేకపోయింది. నాయకులు ఉసిగొల్పితే కార్యకర్తలు మిగతా కాండను పూర్తిచేసారు. 

 

తన కొడుకు ప్రమేయం ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలు కనబడుతున్న ఘోరమైన ఘటన జరిగిన వెంటనే సీనియర్ మిశ్రా హుటాహుటిన దిల్లీ వెళ్ళి దేశంలో శాంతి భద్రతలను, చట్టాన్నీ పరిరక్షించాల్సిన గురుతర బాధ్యత కలిగిన దేశ హోం మంత్రిని కలుసుకున్నారు. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. కాని, జూనియర్ మంత్రిగారు ఆ సమావేశం తర్వాత కూడా తన పదవిలో పదిలంగా ఉన్నారు. ఆశీష్ మిశ్రా తండ్రి తన పదవిలో కొనసాగినా కూడా కొడుకు మీద జరిగే విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని కేంద్ర హోం మంత్రి అనుకుంటున్నారనే దీన్నిబట్టి భావించాల్సి వస్తుంది. లఖింపూర్ ఘటన గురించి కేంద్ర హోం మంత్రి ఏమనుకుంటున్నారో దేశానికి ఇంతవరకూ తెలియదు. విషాదంలోమున్న మృతుల కుటుంబ సభ్యులకు కనీసం సంతాపం తెలిపే నాలుగు మాటలు అనడానికింకూడా ఇంతవరకూ ఆయనకు నోరు రాలేదు. తన సొంత పార్టీ  కార్యకర్తలు కూడా చనిపోయారనే విషయాన్ని కూడా ఆయన పట్టించుకోలేదు. వారి కుటుంబాలకు సైతం అనునయ వచనాలు హోం మంత్రి నోటి నుండి రాలేదు. 

 

లఖింపూర్ ఖేరీ లో ఈ ఘోరమైన హత్యలు జరిగి పది రోజులు దాటుతున్నా, ఆ దుర్ఘటన గురించి ప్రధాన మంత్రి విచారంగా ఉన్నారో లేదు మనకి తెలియదు. అదే రాష్ట్రం లో బారాబంకీ ప్రాంతంలో జరిగిన రోడ్డుంప్రమాదంలో మరణించిన కుటుంబాలకు మాత్రం సంతాపంతెలియజేస్తూ, వారి కుటుంబాలకు ఆర్ధిక సహాయాన్ని ప్రకటిస్తూ ప్రధాని ట్వీట్ చేసారు. ఈ రోడ్డు ప్రమాదం లఖింపూర్ ఖేరీ ఘాతుకం జరిగిగ తర్వాత జరిగింది. కర్ణాటకలోని బెల్గావిలో ఇళ్ళు కూలిపోయి మరణించినవారి కుటుంబాలకు కూడా సంతాపం తెలుపుతూ ట్వీట్ చేసారు. లఖింపూర్ ఘోరం జరిగిన సరిగ్గా అదే సమయంలో ప్రధాని యూపీలోనే అక్కడికి 150 కిలోమీటర్ల దూరంలో ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి ఏదో కొంతమంది విషయంలో మాత్రమే సంతాపం ప్రకటించడం, మరి కొంతమంది విషయంలో మౌనంగా ఉండడం ఇదే మొట్టమొదటి సారి కాదు. దాద్రీ కాండ, దానిష్ సిద్దికీ హత్య, ఇలా అనేక మంది విషయాలలో పలు సందర్భాలలో ప్రధాని మౌనాన్ని ఆశ్రయించారు. కోవిడ్ బారిన పడి చనిపోయిన వేలాది మంది పట్ల సంతాపం తెలుపుతూ ప్రధాని నాలుగు మాటలు మాట్లాడ్డానికి దేశ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భం గా ఎర్ర కోట మీది నుంచి చేసిన ప్రసంగం వరకూ ఆగాల్సి వచ్చింది ఆయనకు. ఆ నాలుగు మాటలూ కూడా ఏదో మొక్కుబడికి పలికిన పలుకుల్లాగే ఉన్నాయి.

ఇది ఎంతో నిరాశ కలిగించే పరిస్థితి. నరేంద్ర మోదీ కరుణ, సాహసం లాంటి విలువలను విశ్వసిస్తారు, ప్రాణప్రదం గా పరిగణిస్తారు అని ఇన్నాళ్లూ జరిగిన ప్రచారానికి ఇది పూర్తిగా విరుద్ధం. ఏడేళ్ళ క్రితం చిన్న పొరపాటును, అపసవ్య వ్యవహారాన్నీ కూడా మోది సహించరు అన్న పబ్లిసిటీకి, ఇప్పటి ఆయన వ్యవహార శైలికీ అసలు పోలికే లేదు. మోడి ఒక సర్వజ్ఞుడు, శషభిషలు సహించని కార్య శూరుడు, అని ఆయనను ఒక మహాపురుషునిగా చిలువలు పలువలుగా అల్లి ప్రచారంలో పెట్టిన కథలు మీలో చాలందికి గుర్తుండే ఉంటాయి. శక్తివంతమైన బీజేపీ డిజిటల్ విభాగం ఈ కథనాలకు విస్తృతమైన ప్రచారాన్ని కల్పించింది. 

ఒక కథ ఇలా సాగింది. తన మంత్రిమండలిలో సభ్యుడైన ఒక మంత్రి ఫైవ్ స్టార్ హోటల్ లో కూర్చుని ఒక వ్యాపారవేత్తతో బాతాఖానీ కొడుతున్నాడు. ఆ మంత్రి ఫోన్ మోగింది. లైన్లో ప్రధాని. ఆ వ్యాపారస్తునితో కలిసికూర్చోడం మంచిది కాదు, అక్కడినుంచి వెళ్ళిపొమ్మని ప్రధాని ఆదేశం. మంత్రి లేచి వెళ్ళిపోయారు. మరో కథ ప్రకారం, ఒక మంత్రి విదేశానికి వెళ్ళేందుకు విమానాశ్రయానికి బయల్దేరారు. జీన్ ప్యాంటూ షర్టూ వేసుకుని ఉన్నారు. ఆయన ఫోన్ మోగింది, లైన్ లో ప్రధాని. భారత దేశ ప్రతినిధిగా జీన్స్ లో ఎలా కనపడతారంటూ మంత్రికి చివాట్లుపెట్టారు. ఆ మంత్రి తన కారును వెనక్కి తిప్పించి, ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని విమానం ఎక్కారు. ఒక మహిళా మంత్రి ఫోన్ ఒక రోజు పొద్దున్న 9:30 కి మోగింది. ఆవిడ ఎత్తితే ఆ వైపు ప్రధాని. ఇప్పటివరకు ఇంట్లో ఏమిచేస్తున్నారు అని ప్రధాని ప్రశ్న. నియోజకవర్గం నుంచి ప్రజలు వస్తే వారిని కలుస్తున్నానని ఆవిడ వివరణ. ఆఫీసుకు ఆలస్యం గా వెళ్ళకూడదు, కావాలంటే వారందరినీ అక్కడే కలుసుకొమ్మని ప్రధాని హితవు. నాలుగో కథనం మరింత ఘాటైనది, సూటిగా ప్రస్తుత పరిస్థితికి సరిపోతుంది. ప్రధాని తన కార్యాలయానికి ఒక మంత్రినీ, అతని కుమారుణ్ణీ  పిలిపించారు. ఒక వ్యక్తి దగ్గర ఏదో ఉపకారం చేస్తానని తీసుకున్న సొమ్మును వెంటనే వాపస్ ఇవ్వాల్సిందిగా ఉపోద్ఘాతం లేకుండా, నిర్మొహమాటంగా తండ్రీ కొడుకులకు చెప్పారు. గతుక్కుమన్న వారు, దిగ్భ్రాంతి నుంచి కోలుకోకుండానే ప్రధాని గది నుంచి నిష్క్రమించారు. 

విలపిస్తున్న కుటుంబాలకు చనిపోయిన రైతుల ప్రాణాలను తిరిగి ఇవ్వవలసిందిగా లఖింపూర్ కి చెందిన మంత్రికీ ఆయన కొడుకుకీ ప్రధాన మంత్రిన ఎలాగూ చెప్పలేరు. కనీసం న్యాయవ్యవస్థకు లొంగిపొమ్మని కొడుక్కీ, రాజకీయాలలో ఉన్నత విలువల్ని పాటించాల్సింది గా మంత్రిగా ఉన్న తండ్రికి అయినా ప్రధాని చెప్పి ఉంటే బాగుండేది. 

 

తాను ఉన్నత విలువలను ప్రమాణాలను పాటించేవాడినని ప్రజలనుకోవాలని కోరుకునే ప్రధాన మంత్రికి తన మంత్రిమండలిలో ఉన్న వ్యక్తి కుమారుడు పోలీసులకు లొంగిపోవడానికి సుప్రీం కోర్టు మొట్టికాయలు వెయ్యడం, ప్రజలు గగ్గోలు పెట్టడం అవసరమా? అటువంటి పరిస్థితులు దాపురించడం మన గణతంత్ర రాజ్యానికి శోభాయమానం కాదు. విశ్వ వేదికలపై సగర్వంగా మనం కీర్తించుకునే మన ప్రజాస్వామ్యానికి తీరని కళంకం. తమ నాయకుడు సమున్నతమైన వాడని ఊహించుకున్న ప్రజలు ఆ అభిప్రాయం అసత్యమనీ, కేవలం భ్రమ అనీ, బీజేపీ సాగిస్తున్న మిరుమిట్లు గొలిపే పెద్ద ప్రచార కాండలో భాగమనీ తెలుసుకున్నప్పుడు, 'అయ్యో, ఇదంతా ప్రచారమేనా, పచ్చి మోసమేనా' అని అనుకోక మానరు. 

ఈ వారం ఇక్కడితో ముగిస్తాను. మళ్ళీ వచ్చే శనివారం ఉదయం 9:00 గంటలకు కలుద్దాం. 

అంతవరకూ శెలవు.

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin