parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.పెగసెస్, సుప్రీం కోర్టు, ప్రభుత్వం: ఘర్షణ అనివార్యమా? || పరకాలమ్ - 5

13-11-2021published_dt 2021-11-13T10:06:17.903Z13-11-2021 15:36:17 IST
2021-11-13T10:06:17.903Z13-11-2021 2021-11-13T10:06:17.903Z - - 04-10-2022

నమస్కారం.

పరకాలమ్ కు స్వాగతం!

అక్టోబర్ 27 న సుప్రీం కోర్టు ఒక కీలకమైన ఆదేశాన్ని జారీ చేసింది. పెగాసెస్ స్పైవేర్ ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం ప్రజల కదలికలమీద, కార్యకలాపాలమీద చట్ట వ్యతిరేకంగా నిఘా నిర్వహిస్తోంది, దీని మీద కలుగజేసుకుని దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ పన్నెండు రిట్ పిటీషన్లు మన సర్వోన్నత న్యాయస్థానం లో దాఖలయ్యాయి. వాటిని విచారించి, ఈ విషయాన్ని కూలాంకషం గా దర్యాప్తు చేయడానికి ఒక రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ వీ రవీంద్రన్ ఆధ్వర్యంలో ఒక కమీటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో ముగ్గురు సాంకేతిక నిపుణులైన సభ్యులు ఉంటారు. మరో ముగ్గురు సభ్యులు జస్టిస్ రవీంద్రన్ కు దర్యాప్తులో సహాయపడతారు. కమిటీ టెరంస్ ఆఫ్ రిఫరెన్స్, పరిశీలనాంశాలు, చాలా సమగ్రమైనవి, విస్తృతమైనవీను. ఏడు అంశాలను ఈ కమిటీ ఆరాతీసి, పరిశోధించి, నిర్ధారించాలి. ఆరు అంశాల మీద విధాన పరమైన సిఫార్సులు చెయ్యాలి. అవసరం అని భావిస్తే ఇతర అనుబంధ అంశాలపైన కూడా సిఫార్సులు చేసే వెసలుబాటు కమిటీకి ఉంది. ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన మన దేశంలో సజీవంగా ఉండాలని కోరుకునే మనలాంటివారం ఈ సుప్రీం కోర్టు ఆదేశాన్ని ఖచ్చితంగా చదివి తీరాలి. ఇది చిన్నదే. కేవలం 46 పేజీలు మాత్రమే. మీలో ఎవరైనా ఇంకా అది చదవకపోయి ఉన్నట్టయితే, దయచేసి చదవమని నా అభ్యర్ధన. దానికి లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఈ ఉత్తర్వు విశిష్టత ఏమిటో అందులో ఇమిడి ఉన్న నిగూడార్ధం ఏమిటో, అత్యంత ప్రాధమికమైన అంశమైన పౌరుల ప్రైవసీ విషయం లో మన సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయం ఏమిటో, ఈ అంశం పట్ల జవాబుదారితనం విషయంలో మన ప్రభుత్వం అంతరంగం ఎలా ఉందో, ఈ విషయం లో ఈ రెండు వ్యవస్థల మధ్యనున్న భేదాభిప్రాయాలు రాబోయే మాసాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీయనున్నాయో ఇవాళ పరిశీలిద్దాం. ఈ భిన్నభిప్రాయాలు ప్రభుత్వానికి న్యాయవ్యవస్థకి executive qజ్యుడీషియరి మధ్య ఘర్షణకి దారి తీస్తే అది మన ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని కూడా ఇవాళ పరిశీలిద్దాం. అటువంటి ఘర్షణ జరిగే అవకాశం ఖచ్చితం గా ఉంది అని నా అనుమానం.

పెగసెస్ విషయం ఈ సంవత్సరం జూలై లో రెండోసారి ప్రధాన చర్చనీయాంశంగా మనముందుకొచ్చినపుడు దానిపైన నా అభిప్రాయాలు చెపాను. ఈ వ్యవహారం అసలు 2019 లో మొదటి సారి వెలుగులోకి వచ్చింది. దీని పై 'హిందూ' పత్రికలో నేనొక వ్యాసం రాసాను. మిడ్ వీక్ మేటర్స్ లో కూడా దీన్ని చర్చించాను. ఆ రెండు సందర్భాల లోను ఈ క్రిందిమ్మాటలతో ముగించాను:

"ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయగల ఇకే ఒక వ్యవస్థ న్యాయ వ్యవస్థ. మన జాతీయ జనజీవనం లో ప్రాముఖ్యం సంతరించుకున్న ప్రధానాంశాలలో సర్వోన్నత న్యాయస్థానం ఇటీవలి కాలంలో అవలంబించిన వైఖరి మిశ్రమంగా ఉన్నదనే చెప్పగలం. అది ఏమి చేయాలని అనుకుంటున్నదో, ఏమి చేయకూడదని అనుకుంటుందో, దాని ప్రభావం దేశం మీద చాలా గాఢంగా ఉంటుంది. న్యాయ వ్యవస్థ ముందున్న రెండు ప్రత్యామ్నాయాలు ఎంత స్పష్టమైనవో అంత కష్టతరమైనవి, గంభీరమైనవి కూడా. మన దేశాన్ని ఒక నిఘా రాజ్యంగా మార్చడానికి ప్రభుతం చేసే ప్రయత్నాలను అనుమతించడం ఒకటి. అలా కాకుండా ప్రభుత్వాన్ని నిలువరించి మన రాజ్యాంగ ప్రదాతలు మనకుంప్రసాదించిన స్వేఛ్చా స్వాతంత్ర్య విలువలను కాపాడి ప్రజలకు దఖలు పరచడం రెండోది. న్యాయ వ్యవస్థ ఈ విషయంలో తొందరగా కదలాలి. దేశానికి ఎక్కువ వ్యవధి లేదు."

ఈ రెండింటి లిక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వీలయితే చూడండి.

ఒక సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో పనిచేసే సాంకేతిక కమిటీని నియమించాలని ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని సుప్రీం కోర్ట్ బెంచ్ నిర్ణయించే క్రమంలో అది పరిగణనలోకి తీసుకున్న అంశాలు, వాటి హేతుబద్ధత ఏమిటొ ఇప్పుడు పరిశీలిద్దాం. మనమ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నిర్ణయం తీసుకోవడంలో కోర్టు అస్సలు తొందరపడలేదు. ముందు పడ్డ రిట్ పిటీషన్లు అన్నీ వార్తా పత్రికలలో వచ్చిన కథనాల పైనే ఆధారపడ్డాయి కనుక మొదట్లో అవి తమకు సంతృప్తి కలిగించ లేదని బెంచ్ తన ఉత్తర్వులోనే స్పష్టంగా పేర్కొంది. కానీ ఆ తర్వాత దాఖలైన పిటీషన్లు, ముఖ్యం గా పెగసస్ స్పై వేర్ కు నేరుగా బాధితులైన వారు వేసిన పిటిషన్లు, అవి సమర్పించిన అదనపు సమాచారం, పత్రాలు, దస్తావేజులు, ప్రతిష్ఠితులైన నిపుణులు ఇచ్విన అఫిడవిట్లు, విదేశీ ప్రభుత్వాల స్పందన, సిటిజెన్ లాబ్ వంటి సంస్థల నివేదికలూ చూసిన దరిమిలా ఈ వ్యవహారంలో కలుగజేసుకునే విషయం పరిశీలించ వచ్చును అనే అభిప్రాయం కలిగిందనీ, న్యాయస్థానం కలుగచేసుకోవడానికి తగినంత ప్రాతిపదిక ఉన్నదని భావించడానికి సరిపడా సమాచారం ఉన్నదని బెంచ్ పేర్కొంది.

ఇక భారత ప్రభుత్వ స్పందన ఎలా ఉందో చూద్దాం. పిటీషనర్ల నుంచి సమాచారం, దస్తావేజులు అందిన తర్వాత ఈ విషయంలో వివరణ ఇవ్వడానికీ, తన వద్ద ఉన్న సమాచారం సమర్పించడానికీ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు తగినంత వ్యవధి, అవకాశం ఇచ్చింది.

జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల గురించి ఎటువంటి సమాచారాన్నీ తాము అడగబోమని కూడా బెంచ్ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. పదే పదే ఈ విషయంలో హామీ ఇచ్చినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా కోర్టులో హాజరైన సోలిసిటర్ జనరల్ ఒక పరిమితమైన అఫిడవిట్ (లిమిటెడ్ అఫిడవిట్) ను మాత్రమే ఫైల్ చేసారు. పౌరుల ప్రాధమిక హక్కులు ప్రశ్నార్ధకమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతికూల వైఖరి అవలంబించరాదని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం మాత్రం జాతీయ భద్రత అంశాన్ని మిషగా చూపించి సవివరమైన అఫిడవిట్ ను సమర్పించకపోవడాన్ని సమర్ధించుకుంది. అదే వైఖరిని పార్లమెంటులోను, బహిరంగ చర్చల్లోనూ కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించింది. ఈ సందర్భంలోనే సుప్రీం కోర్టు బెంచ్ చాల విశేషమైన వ్యాఖ్యల్ని చేసింది. వాటిని ఇక్కడ కోట్ చేస్తాను:

"జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలలో న్యాయ వ్యవస్థ సమీక్ష పరిమితంగా ఉంటుందన్నది సర్వాంగీకారం పొందిన సూత్రం. కానీ అంతమాత్రాన జాతీయ భద్రత అంశాన్ని ప్రస్తావించిన ప్రతిసారీ ప్రభుత్వానికి ఆటవిడుపు లభిస్తుందని అర్ధం కాదు. జాతీయ భద్రత అంశం లేవనెత్తగానే ఏ విషయమైనా న్యాయ వ్యవస్థ దాని నుంచి దూరంగా తొలగిపోవాల్సిన భయానకమైన అంశం కారాదు. జాతీయ భద్రత విషయం లో ఈ న్యాయస్థానం బహు జాగ్రత్తగా ఉండాలనే సంగతి గమనంలో పెట్టుకుంటూనే ఆ విషయాన్ని న్యాయ వ్యవస్థ సమీక్షనుంచి పూర్తిగా మినహాయించాల్సిన అవసరం లేదు."

జాతీయ భద్రత పేరుచెప్పి తన చర్యలను న్యాయ సమీక్షకు అవకాశమే లేకుండా, న్యాయ వ్యవస్థ ప్రేక్షక పాత్ర పోషించే విధంగా చేయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు స్పష్టంగా తెలియచెప్పిందని ఇక్కడ మనం అర్ధం చేసుకోవాలి. ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలను ఏ మాత్రం వెల్లడించకుండా ఒక అస్పష్టమైన అఫిడవిట్ ను ప్రభుత్వం కోర్టుకు సమర్పించడాన్ని కోర్టు తప్పుబట్టింది. దాన్ని ప్రభుత్వమే స్వయంగా 'లిమిటెడ్ అఫిడవిట్' గా వర్ణించిందంటే అది ఎంత అసంపూర్ణంగా ఉందో మనం ఊహించుకోవచ్చు. దీన్ని, పౌరుల ప్రాధమిక హక్కులకు సంబంధించిన వ్యవహారంలో ఈ విధమైన కార్యాచరణ తనకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కోర్టు స్పష్టంగా ప్రకటించింది. ఈ విషయంలో కోర్టు కలుగజేసుకోవడానికి ప్రభుత్వ వైఖరే కారణమని తేల్చి చెప్పింది.

"ఈ కేసులో రెస్పాండెంట్ అయిన భారత యూనియన్ ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేసి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. మా పైన భారం వేరే విధం గా ఉండేది."

అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తన వైఖరిని వివరించకుండా ప్రభుత్వమే న్యాయస్థానం జోక్యాన్ని ఆహ్వానించిందని కోర్టు చెప్పిందని అనుకోవచ్చు. ఎటువంటి పరిస్థితులు కోర్టు ఉత్తర్వు జారీచేసే విధంగా చేసాయో జాబితా ఇస్తూ, ఈ బిందువు కూడా కోర్టు పేర్కొంది:

"రెస్పోండెంట్ అయిన యూనియన్ ఆఫ్ ఇండియా ఏయే చర్యలు తీసుకుందో స్పష్టంగా తెలియజెయ్యలేదు."

ఆరోపణలపై దర్యాప్తు చెయ్యడానికి సాంకేతిక నిపుణులతో కమిటీని నియమిస్తానంటూ భారత ప్రభుత్వం వెలిబుచ్చిన సంసిద్ధతను కోర్టు తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం పై గాని, రాష్ట్ర ప్రభుత్వం పై కాని ఆరోపణలు వచ్చినపుడు ప్రభుత్వమే దర్యాప్తు కమిటీని నియమించడం "న్యాయం చెయ్యడమే కాదు, న్యాయం చేసినట్టు కూడా కనిపించాలి" అనే మౌలిక సూత్రానికి విరుద్ధమని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. కోర్టు చేసిన మరో వ్యాఖ్యను కూడా మనం ఇక్కడ గమనం లో పెట్టుకోవాలి. స్వతంత్రంగా, రాగద్వేషాలకు అతీతంగా ఉండి సమర్ధులైన నిపుణులను గుర్తించడం చాలా కష్టమయ్యిందని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. కోర్ట్ వేస్తున్న కమిటీలో ఉండమని కోరితే వ్యక్తిగత కారణాలవల్ల కుదరడం లేదని కొందరు మర్యదాగా చెప్పి నిరాకరించారని, మరికొందరు తమకి conflict of interest ఉందని తప్పుకున్నారనీ కోర్టు చెప్పింది. పిటీషన్లను విచారిస్తున్న సమయంలో కమిటీ వేస్తామని బహిరంగంగా బెంచ్ ప్రకటించినప్పటికీ వారాల తరబడి కమిటీ పడకపోవడానికి, జాప్యం జరగడానికి ఇది ముఖ్యమైన కారణం.

నేను ఇప్పటి వరకూ ప్రస్తావించిన ప్రధానాంశాలను ఒకచోటికి తెచ్చి ఒకదాని తర్వాత ఒకదానిని నిశితంగా విశ్లేషిద్దాం. మొదటిది: పిటిషన్లలో చేసిన ఆరోపణలపైన సమగ్రమైన వివరణ ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది. సమగ్రమైన వివరాలు ఇవ్వడానికి జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు కారణమని చెప్పింది. రెండవది: తనపైన వచ్చిన ఆరోపణలను విచారించేందుకు తానే ఒక కమిటీని వేస్తానని ప్రభుత్వమ కోర్టుకు చెప్పింది. మూడోది: స్వతంత్రంగా, రాగద్వేషాలకు అతీతంగా వ్యవరించే సమర్ధులైన నిపుణులను దర్యాప్తు కమిటీలో ఉండడానికి ఒప్పించడం చాలా కష్టమైందని కోర్టు స్వయంగా అంది.

ముందుగా మూడో అంశాన్ని తీసుకుందాం. దేశంలో భయం, ఒత్తిడితో కూడుకున్న వాతావరణం నెలకొంది అనడానికి ఇది ప్రబల తార్కాణం. ప్రభుత్వ వ్యవహారాలను కూపీ లాగే సిసలైన దర్యాప్తులో భాగం కావడానికి నిపుణులు హడలిపోతున్నారు. మన ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ ఇవాళ ఎదుర్కొంటున్న పెద్ద చిక్కు ఇది. రెండో అంశం: ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చెయ్యడానికి ప్రభుత్వమే ఒక కమిటీని నియమించడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం. ఇటువంటి సూచనను సుప్రీం కోర్టుకు చేసే దుస్సాహసం ప్రభుత్వం చేసిందంటే కోర్టు అంటే ఎంత లెక్కలేనితనం ప్రభుత్వం లో గూడుకట్టుకుని ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. దర్యాప్తు చేసేసామనీ, కమిటీ ప్రభుత్వం నిర్దోషి అని చెపుతూ యోగ్యతా పత్రం ఇచ్చేసిందనీ అటు కోర్టును ఇటు ప్రజానీకాన్నీ ఏమార్చవచ్చని ప్రభుత్వం భావించినట్టుగా మనం లెక్కేసుకోవచ్చు. ఇటీవలి కాలం లో తనకు అలవాటైన పద్ధతిలోనే, ప్రభుత్వం తందాన అంటే సుప్రీమంకోర్టు తాన తందాన అంటుదని అంచనా వేసుకుందని తెలుస్తోంది. తనకు కావలసినట్టుగా నివేదిక రాసి ఇచ్చే నిపుణులు కూడా తేలికగానే దొరుకుతారని ప్రభుత్వ ధీమాగా కనబడుతోంది. న్యాయమైన, నిస్పక్షపాత దర్యాప్తు జరగాలని కనీసం ఆకాంక్ష ఉన్నట్టుగానైనా కనపడాలని ప్రభుత్వం ప్రయత్నించలేదు.

ఇక ఇప్పుడు మొదటి అంశాన్ని పరిశీలిద్దాం. వాస్తవాలు బయటపడకుండా ప్రభుత్వం అడ్డం పడుతోంది. ప్రభుత్వం ఏదో దాస్తోందనే అనుమానం ప్రజలలో బలపడుతోంది. ప్రభుత్వం నిర్దోషి అయితే పార్లమెంటులోనూ, బయట ప్రజలతోనూ, ఆ తర్వాతకోర్టు తోను ఏదో ఒక మాట స్పష్టంగా చెప్పి ఉండేది. తను పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనలేదని అయినా చెప్పచ్చు. ప్రజలమీద చట్ట విరుద్ధంగా నిఘా వేసారన్న ఆరోపణల నిగ్గు తేల్చే దర్యాప్తు జరిపితే అందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించవచ్చు. లేదా, పెగాసెస్ కొన్నాం, కాని అది చట్టానికి, నియమనిబంధనలకు లోబడి నిఘాకి వినియోగించాం అనైనా చెప్పచ్చు. ఈ రెంటిలో ఏ ఒక్కటీ చెప్పకుండా, జాతీయ భద్రత సాకు చూపించి, బుకాయించి, అసలు విషయం బయటకు రాకుండా అడ్డం పడ్డం వల్ల ఈ ప్రభుత్వం పట్ల తీవ్రమైన అనుమానాలు, భయాలూ తలెత్తుతున్నాయి. మన రిపబ్లిక్ ను నిఘారాజ్యంగా మార్చే క్రమంలో ఈ ప్రభుత్వం చాలా దూరం వెళ్ళిపోయిందని అనుకోవలసి వస్తుంది.

ఇటువంటి నిఘా మనస్తత్వం కల ప్రభుత్వం, సమాచారం బయటకు వెల్లడికాకుండా అడ్డంపడే మనస్తత్వం కల ప్రభుత్వం, దాచాల్సిన విషయాలున్న ప్రభుత్వం జస్టిస్ రవీంద్రన్ కమిటీకి సహకారమందించే అవకాశాలు ఏమాత్రం కనపడ్డం లేదు. కమిటీ దర్యాప్తును భ్రష్టు పట్టించేందుకు చేయవలసిందంతా ప్రభుత్వం చేస్తుంది. రికార్డులు ఇవ్వనని అనడం ప్రజల్లో యాగీ అవుతుందని అనిపిస్తే ఆ రికార్డులునందజేయడంలో సాధ్యమైనంత ఆలస్యం చేస్తుంది. ఏది ఏమైనా వాస్తవాలను కప్పిపుచ్చే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వానికి కమిటీ ఎనిమిది వారాలేమిటి, పదహారు వారాలైనా అంగుళం ముందుకెళ్ళకుండా చేయడం పెద్ద పనికాదు. నిజమైన దర్యాప్తు జయప్రదంగా జరిగితే అది - ప్రభుత్వం కేవలం పద్ధతి ప్రకారం నడుచుకోలేదు, ఏవో చిన్న చిన్న పొరపాట్లు మాత్రమే జరిగాయని వేలెత్తి చూపించి ఊరుకోదు. ఆ విషయం అందరికన్న ఎక్కువగా ప్రభుత్వానికి తెలుసు. terms of reference ను అనుసరిస్తూ దర్యాప్తు సక్రమంగా, నిజాయితీగా ముగింపు వరకూ తీసుకుని వెడితే ప్రభుత్వ ఉనికికీ, కొనసాగింపుకు, అధికార పక్షం రాజకీయంగా అజేయమైన శక్తిగా నిలబడడానికి ఆధారభూతమైన నిఘా వ్యవస్థ తాలుకు రహస్య పేటికలు బద్దలైపోతాయి. అధికారపక్షానికి పెద్ద ముప్పు ఎదురౌతుంది. ప్రభుత్వాన్ని కోల్పవడం మాత్రమే కాదు. ముప్పు అంతకంటే పెద్దది. తాననుకున్న హిందూ మత మౌఢ్య ఆధిక్యత ప్రాతిపదికగా భారత్ ను పునర్వ్యవస్థీకరించాలనే బృహత్ లక్ష్యానికే గండి పడుతుంది.

కమిటీకి ప్రభుత్వానికి మధ్య ఘర్షణ జరిగే అవకాశముంది. కమిటీ దర్యాప్తును ముందుకు సాగనివ్వకుండా ప్రభుత్వం తన పూర్తి శక్తిని వినియోగించి శతవిధాల ప్రయత్నించినా ఆశ్చర్యపోనక్కర లేదు. ఈ ఘర్షణ ప్రభుత్వానికి, సుప్రీం కోర్టుకి మధ్య స్పర్ధగా పరిణమించడం అనివార్యం కావచ్చు. ఇప్పుడు మన ప్రజాస్వామ్యం ఒక కీలకమైన కూడలిలో నిలబడినుంది. కుటిల నిఘా వ్యవస్థ ఒకవైపు, చట్టబద్ధ పాలనలో విశ్వాసమున్న శక్తులు మరో వైపు మోహరించి బాహాబాహీగా తలపడే పరిస్థితులు దాపురించక పోతే మనం అదృష్టవంతులమనే చెప్పుకోవాలి. ఒకవేళ అదే జరిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన చట్ట పాలన సంస్థలకు అలా తలపడ్డానికి వాటికున్న బలం సరిపోదు. ఆ సంస్థలకు పౌర సమాజం నుంచి బలమైన వెన్నుదన్ను అవసరం. ప్రస్తుత ప్రభుత్వ అధీనంలో ఉన్న కుటిల నిఘా వ్యవస్థ ధాటికి తట్టుకుని నిలబడాలంటే పౌర సమాజం నుంచి చట్ట సంస్థలకు గట్టి మద్దతు లభించాలి. అలాంటి విపరీత పరిణామం భారత దేశంలో జరగదులే అనే గుడ్డి నమ్మకంతో ఉదాసీన, నిర్లక్ష్య ధోరణిలోకి జారుకోకండి. ఇలాంటివి ఎక్కడైనా జరగవచ్చు. ఎప్పుడైనా జరగవచ్చు.

ఈ ఏడాది జనవరి 6 న అమెరికా రాజధాని నగరంలో వారి ప్రభుత్వం, చట్టసభలు కొలువుతీరే భవన సముదాయంలోకి అరాచక మూకలు చొచ్చుకొని వెళ్ళి ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం మనం కళ్ళారా చూసాం. అదృష్టం ఏమిటంటే ఆ మూక అంత సంఘటితమైనది కాకపోవడం. అలాంటి ఘటనే మన దేశంలో జరిగితే మనం అంత అదృష్టవంతులం కాకపోవచ్చు. ఎందుకంటే, సంఘటితమైన, సుశిక్షితులైన, మూఢమైన భావజాల ప్రభావితులై పూనకంలో ఉన్నవారు, బలమైన లక్ష్యశుద్ధి కలిగి క్రమశిక్షణ కలవారు ఎంతకు ఒడిగట్ట గలరో మనం అయోధ్యలో చూసి ఎన్నో సంవత్సరాలుకాలేదు. నాకు ఒక ఆకాంక్ష, ఒక ఆశ ఉన్నాయి. నా ఆందోళన నిరాధారమైనదనీ, నా భయాలకు ప్రాతిపదికే లేదనీ, నా అనుమానాలు తప్పనీ నిరూపణ కావాలని నా ఆకాంక్ష. సుప్రీంకోర్టు ఏమాత్రం మెత్తబడకుండా తన వైఖరికి కట్టుబడి ఉంటుందనీ, అంతిమంగా ప్రభుత్వమే తలవొగ్గుతుందనీ, నిజం ఒప్పుకుంటుందనీ, ఎటువంటి పేచీ పెట్టకుండా తనచర్యల పర్యవసానాలను స్వీకరిస్తుందనీ నా ఆశ.

ఇవాళ ఇక్కడితో ముగిస్తాను.

మళ్ళీ మరో అంశంతో మిమ్మల్ని వచ్చే నెల, డిసెంబరు మొదటివారంలో కలుస్తాను.

అంతవరకూ సెలవు.

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin