parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.కాంగ్రెస్ లో సంక్షోభం... ఇందుకేనా? || పరకాలమ్ -1

22-10-2021published_dt 2021-10-22T12:27:33.981Z22-10-2021 17:57:33 IST
2021-10-22T12:27:33.981Z22-10-2021 2021-10-22T12:27:33.981Z - - 04-10-2022

కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉంది. వరసగా రెండుసార్లు పరాజయం పాలయ్యింది. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పటికి కూడా పూర్తి స్థాయి అధ్యక్ష్యుణ్ణి ఎంపిక చేసుకోలేక పోయింది. ఆ పార్టీపంజాబ్ విభాగం అల్లకల్లోలంలో ఉంది. పంజాబ్ తొందరలో ఎన్నికలకు వెళ్ళబోతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్ ఘర్ లో ముఠా తగాదాలు ముమ్మరంగా ఉన్నాయి. రాజస్థాన్ లో బొటాబొటీ మెజార్టీతో అధికారంలో ఉన్నా అక్కడకూడా అసమ్మతి సెగ రగులుతోంది. ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఒక ముఖ్యమంత్రి తన రాష్ట్రంలో తనని సంప్రదించకుండా కాంగ్రెస్ అధ్యక్ష్యుణ్ణి నియమించారని బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు. గోవా మాజీ ముఖ్యమంత్రి పార్టీ వదిలి వెళ్ళిపోయారు. కేరళ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అధిష్టానం మీద అసంతృప్తితో పేపర్లకి ఎక్కుతున్నారు. పార్టీలో సంస్కరణలు కావాలని డిమాండ్ చేస్తున్న ఇరవై ముగ్గురు జాతీయ స్థాయి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ జీ 23 నాయకులు ఇంతవరకూ అధిష్టానం తమ వాదనను పట్టించుకోలేదని వాపోతున్నారు. 

సంస్థాగతంగా అస్తవ్యస్త పరిస్థితులే కాదు. అసలు ఆ పార్టి తను ఏమి సాధించడానికి పుట్టిందో, తన ఆత్మ ఏమిటో, మూలాలు ఏమిటో కూడా విస్మరించిందా, అయోమయంలో ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకప్పుడు అత్యంత వైభవంగా వెలిగిన కాంగ్రెస్, దేశంలో ఏకఛత్రాధిపత్యాన్ని నిర్వహించిన పార్టీ ఎందుకు ఈ  దుస్థితికి చేరుకుంది? ఈ దుస్థితి నేపధ్యం ఏమిటి? ఇప్పుడు అది ఎదుర్కుంటున్న పెను సవాలు ఏమిటి అన్న విషయాలమీద ఇవాళ నా ఆలోచనల్ని మీ ముందు ఉంచుతాను. 

కాంగ్రెస్ గురించి ఈ ఆవేదనాత్మకమైన మాటలను ఒకసారి ఆలకించండి:

"ప్రజలతో సంబంధాలను మనం చాలావరకూ కోల్పోయాం. వారితో ఉంటే మనకి లభించే జవసత్వాలను మనం పొందడం లేదు. మన సంస్థ ఎండిపోతోంది. మనం బలహీనపడుతున్నాం, మన సంస్థ చిక్కి శల్యమైపోయి తన శక్తిని కోల్పోతోంది." 

ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సాక్షాతు పండిత్ జవహర్లాల్ నెహ్రూ. స్వాతంత్ర్యం సిద్ధించడానికి ఒక పదేళ్ళ ముందు, కాంగ్రెస్ పుట్టిన యాభై యేళ్ళ తర్వాత, మహాత్ముని మార్గదర్శనం లో కాంగ్రెస్ నఊస్తున్న కాలంలో, లక్నో లో 1936 లో జరిగిన కాంగ్రెస్  సమావేశాల్లో ఆయన అన్న మాటలివి. 

కాంగ్రెస్ మీద మరొక ఘాటైన విమర్శనను వినండి. 

" మన గొప్ప సంస్థకు ఏమయ్యింది? దేశవ్యాప్తం గా ప్రజలకునాయకత్వం వహించే స్థాయి నుంచి మనం కుంచించుకు పోయాం. కోట్లాది కష్ట జీవులతో మనం సంబధాలు కోల్పోయాం. ఎన్నికలలో గెలిచామా, ఓడామా అన్నది ముఖ్యమ కాదు. ఒక ప్రజాస్వామ్య సంస్థకు తన రాజకీయ ప్రస్థానంలో గెలుపు ఓటములు సహజం. మనం ప్రజలమధ్య ఉండి వారితో పని చేస్తున్నామా లేదా, వారి పోరాటాలతో, ఆశలతో అభిలాషలతో మమేకమౌతున్నామా లేదా అన్నదే ప్రధానం."

"...మనం బలహీనులమై పోయాం. జనబాహుళ్యంతో సంబంధాలు కోల్పోవడంవల్ల చాలా దురవస్థలో ఉన్నాం." 

"... మనం ఏ క్రమశిక్షణకీ లొంగం, ఏ నిబంధననూ పాటించం, రాజకీయాలలో ఆచరించాల్సిన నియమాలను పట్టించుకోం, అవినీతిని సహించడమే కాదు,అవినీతికింపాల్పడడమే ఒక గొప్ప నాయకత్వ లక్షణంగా పరిగణిస్తున్నాం. చెప్పేదానికి చేసేదానికీ పొంతనలేని జీవితాలు మనవి. ప్రతి అడుగులోనూ ఆదర్శాలకు మన ఆచరణకూ మధ్య ఘర్షణ ఉంది. దాంతో ప్రతిదశలోనూ మన వ్యక్తిగత జీవితం మన సామాజికి నిబద్ధతకు తిలోదకాలిస్తోంది." 

"... మనకు వారసత్వం గా వచ్చిన అందమైన పాత వస్తువులాగ మన పార్టీ సిద్ధాంతాలని చూస్తున్నాం. ప్రత్యేక సందర్భాలలో వాటిని బయటకు తీసి దుమ్ము దులిపి పదిమందికీ చూపించడానికా అన్నట్లు ముస్తాబు చేస్తున్నాం.  మహోన్నతమైన మన జాతికి అనువైనవి మన సిద్ధాంతాలు మాత్రమే. అయితే, వాటిని మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఎప్పటికప్పుడు అన్వయించి ప్రజలకు చేర్చాలి. మన ప్రత్యర్ధులు చేసే విమర్శలనుంచి వాటిని కాపాడాలి. ఈ విషయాన్ని మనం మరిపోతున్నాం." 

నెహ్రూ విమర్శ చేసిన సుమారు యాభై యేళ్ళ తర్వాత 1985 కాంగ్రెస్ శతవార్షికోత్సవ సభలో ఆ నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ చేసిన ప్రసంగలోని వాక్యాలవి. ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత దిగాలుగా ఉన్న పార్టీ అధినేత కాదు అయన ఆనాడు. మన దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని అఖండ విజయం సాధించిన తర్వాత AICC వేదిక మీది నుంచి మాట్లాడిన మాటలవి. 

దానికి ముందు 1974 నవంబర్ లో శ్రీమతి ఇందిరా గాంధీ ఆదేశానుసారం పార్టీ నాయకులు నరోరాలో వ్యూహ రచన సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ఎదుర్కొంటున్న రాజకీయ సమస్యలపై స్పష్టత తెచ్చుకొని సిద్ధాంత పరమైన, సంస్థాగతమైన అంశాలను విశ్లేషించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిచడానికి ఉద్దెశించిన సమావేశం అది. సుదీర్ఘ చర్చల తర్వాత 13 అంశాలతో కూడిన రాజకీయ ఆర్ధిక కార్యాచరణ ప్రణాళికను అక్కడ రూపొందించారు. అయితే దాని అమలు చేసే లోగానే దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడం, ఆ పై జరిగిన 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం, ఓటమి తర్వాత పార్టీలో ఒడిదుడుకులు, చీలిక, తిరిగి 1980 లో అధికారం లోకి రావడం, ఇందిరా గాంధీ హత్య, 1984 లో ఎన్నికలు, ఆ ఎన్నికల్లొ కాంగ్రెస్ ఘన విజయం.

ఇలా ఒకదానితర్వాత ఒకటి ముఖ్య పరిణామాలు వెంటవెంటనే జరిగిపోయాయి. పర్యవసానంగా నరోరా ప్రణాళిక ఆచరణకి నోచుకోలేదు.

బొంబాయి వేదికగా 1985 AICC సమావేశాల్లో అత్యంత నిర్మొహమాటంగా, కఠినంగా ఆత్మవిమర్శ చేసుకుంటూ సాగిన రాజీవ్ గాంధీ అధ్యక్షోపన్యాసాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం రాజీ గాంధీ చేయలేకపోయారు. షాబానో కేసు, ముదురుతున్న అయోధ్య వివాదం, రామమందిరానికి శిలన్యాసం, పరువునష్టం బిల్లుల పై చెలరేగిన రభస, వీటన్నిటికంటే ముఖ్యంగా బొఫోర్స్ కుంభకోణం మీద లేచినదుమారం రాజీవ్ గాంధీకి కంటిమీద కునుకు లేకుండా చేసాయి. సంస్థాగత విషయాల మీద ఆయనకున్న ఆలోచనల్ని ఆచరణలో పెట్టడానికి కావల్సిన ఏకాగ్రతను లేకుండా చేసాయి. 1989 లో పార్టీ పరాజయం, దరిమిలా రెండేళ్ళ పాటు గందరగోళం, రాజీవ్ గాంధీ హత్య, అనూహ్యంగా పీవీ నరసింహా రావు ప్రధాని కావడం, ఆర్ధిక సంక్షోభం, ఆర్ధిక సంస్కరణల అమలు, వీటితో పార్టీ నాయకత్వానికి ఊపిరి సలపలేదు. సంస్థాగత సంస్కరణల గురించి ఆలోచించే వ్యవధి లేకుండా పోయింది. పుణ్యకాలం అప్పుడు అలా గడిచిపోయింది. పీవీ ప్రభుత్వానికి ఉన్న ఇంతో అంతో రాజకీయ పలుకుబడి ఆర్ధిక సంస్కరణల గురించి అటు పార్టికి, ఇటు దేశానికీ వివరించి నచ్చచెప్పడానికే సరిపోయింది. పార్టీలో పీవీ తిరుగులేనిన్నాయకుడుఏమీ కాదు. అంతర్గతంగా చాలా సవాళ్ళను, వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది. సంస్థాగతంగా చేపట్టాల్సిన అంశాలమీద మేధోమధనం చెయ్యాలనే అభిలాషకు దోహద పడే వాతావరణం మృగ్యమయ్యింది. 

1996 ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలవ్వడంతో అసలు ఆర్ధిక సంస్కరణలు అభిలషణీయమా అనే భయ సందేహాలు బయలుదేరాయి. పార్టీ సిద్ధాంతం గురించి, లక్ష్యం గురించీ అనుమానాలు వ్యక్తమవ్వడం మొదలయ్యింది.  పరిస్థితులను సమీక్షించేందుకు కాంగ్రెస్ నాయకులు 1998 లో పంచ మఢీ లో చింతన సమావేశాన్ని నిర్వహించారు. కీలకైన అంశాలలో పార్టీ విధానాలునంత స్పష్టంగా లేవని గుర్తించినట్లుగా సమావేశ చర్చాపత్రం లో పేర్కొన్నారు. ఈ అస్పష్టత కారణంగా పార్టీ కట్టుబడ్డ సిద్ధాంతాలుఏమిటా అన్న విషయం లో ప్రజలకే కాదు, పార్టీ శ్రేణులలోనూ అయోమయం నెలకొన్నదనీ, ఆదివాసీ, దళిత, బలహీన వర్గాల వారి ఆకాంక్షలను అర్ధమంచేసుకుని వాటిని పట్టించుకోవడంలో పార్టీ విఫలమయ్యిందనీ ఆ సమావేశం ఒక అభిప్రాయానికి వచ్చింది. ఉత్తర్ ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలలో పార్టీ ప్రాబల్యం తగ్గిపోఅడానికినదే ప్రధాన కారణమని గుర్తించింది ఆ సమావేశం. 

" మనల్ని బలపరచే మన మీద ఆశలు పెట్టుకున్న సామాజిక వర్గాలను, సామాజిక సమీకరణల పునాదినీ మనం కోల్పోవడం చాలా ఆందోళన కలిగించే విషయమని" పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ సమావేశంలో వెలిబుచ్చిన అభిప్రాయం. అయితే దేశం లో సంఘ పరివార్, బీజేపీ లు తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి నిశ్శబ్దంగా చేసుకుంటూ వస్తున్న పనిని 1998 పచ్ మఢీ కాంగ్రెస్ సమావేశం గ్రహించినట్టు ఎటువంటి దాఖలాలూ కనపడవు. అలాగే, ఆ సమావేశాల తర్వాత ఆదివాసీ, దళిత, ఓబీసీ వర్గాల మద్దతును గెలుచుకునే ప్రయత్నాలు కూడా సవ్యంగా సాగలేదు. కుల అస్థిత్వాలకు పెద్దపీట వేసే పార్టీలు ఆ రాష్ట్రాలలో వేళ్ళునుకున్నాయి. ఆ వర్గాల మద్దతును కాంగ్రెస్ తిరిగి సంపాదించుకోలేక పోయింది. 

పంచ్ మఢీ శిబిరానికీ 2004 ఎన్నికలకీ మధ్య కాంగ్రెస్ లో సైద్ధాంతికి పునరుజ్జీవం కోసం ఎటువంటి ప్రయత్నమూ జరగలేదు. అదివరకు పార్టీకి అండగా నిలచిన సామాజిక వర్గాల విధేయతను తిరిగి సంపాదించుకునే ప్రయత్నాలు అపసవ్యంగా జరిగాయి. 2004 లో కాంగ్రెస్ ను విజయం వరించింది. అయితే, ఆ ఎన్నికల్లో బీజెపీ నాయకత్వం చేసిన వ్యూహాత్మక తప్పిదాలే అందుకు ప్రధాన కారణం. అయితే, గెలుపు తర్వాత కూడా తాను తిరిగి ఏ వర్గాల మద్దతు సంపాదించుకోవాలి అని ఆశించిందో ఆ వర్గాల మద్దతును గడించుకోలేక పోయామే అన్న స్పృహ కూడా కాంగ్రెస్ కుంలేకుండా పోయింది. 2009 లో తిరిగి బీజెపీ ఓడిపోవడాన్ని కాంగ్రెస్ సరిగా అర్ధంచేసుకోలేదు. సంఘ్ పరివార్ బీజెపీ లు ఇక కోలుకోలేనంతగా బలహీనంపడ్డాయి అని ఆ ఓటమిని చూసి భ్రమ పడింది. దేశమంతా ఎదురు తిరిగినా తనకి ఎప్పుడూ కంచుకోటగా నిలబడ్డ ఆంధ్ర ప్రదేశ్ విషయంలో పప్పులో కాలేసి ఇరు ప్రాంతాల్లోనూ రెంటికీ చెడ్డ రేవడిలా మిగిలింది. 

2014 ఎన్నికల్లో బీజెపీ మోహరించిన శక్తి, వనరులు, ప్రదర్శించిన దూకుడు ముందు కాంగ్రెస్ నిలవలేక పోయింది. పదింసంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన ఆర్ధిక ప్రగతి, ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు బీజెపీ చేసిన వ్యతిరేక ప్రచారానికి ఆగలేక పోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందనీ, విధాన నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉందనీ, పాలసీ పెరాలసిస్ బారిన పడిందనీ, బీజెపీ చేసిన ప్రచారం ప్రజలను ఆకట్టుకుంది. మధ్యతరగతి ప్రజలు తనకుందూరమవుతున్నారనే వాస్తవాన్ని కాంగ్రెస్ గుర్తించలేకంపోయింది. ఒక వేళ గుర్తించినా దాన్ని నిలూరించడానికినే చర్యకూ ఉపక్రమించలేక పోయింది.

అవినీతి వ్యతిరేక ఉద్యమం జరుగుతున్నపుడు యువ నాయకుడు రాహుల్ గాంధీ కన్నా డెబ్బయ్యవ పడిలో ఉన్న అన్నా హజారే వైపే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో, పట్టణాలలో ఉన్న యువత ఆకర్షితులయ్యారనేది ఆనాడు అందరూ గమనించిన విషయం. 2004, 2009 ఎన్నికల్లోకాంగ్రెస్ విజయానికి తోడ్పడిన వర్గాలు పార్టికి దూరమంకాకుండా నిలుపుదల చేయగలిగిన సంస్థాగత యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి లేకపోయింది. ప్రభుత్వం తికమక పడింది. నిర్దిష్టమైన, సమగ్రమైన సైద్ధాంతిక ప్రాతిపదికను ప్రజలముందు ఉంచలేకపోయింది. ఎన్నికలకు ముందు, 2013 లో జైపూర్ లో జరిగిన చింతన్ శిబిరం పార్టీ రాజకీయ సైద్ధాంతిక సవాళ్ళను మదింపు వెయ్యకుండా ముగిసింది. తన ప్రాభవానికి ఎదురవుతున్న రాజకీయ సవాళ్ళపై ఎన్నికలకు ఏడాది ముందు కూడా దృష్టి పెట్టలేదు. 2014 ఓటమి తర్వాత సైతం తన సైద్ధాంతిక పాతిపదికను పుర్నర్విమశ చేసుకుని 2019 ఎన్నికలకు సమాయత్తం కాలేక పోయింది. 

ప్రస్తుతం కాంగ్రెస్ బీజెపీ ల మధ్య రాజకీయ సమరం అసమానులమధ్య యుద్ధంలాగ ఉంది. కాంగ్రెస్ రాజకీయ విమర్శ అంతా మోడి ప్రభుత్వ నిర్ణయాలు, పనితీరు చుట్టూ తిరుగుతున్నాయి. అటువంటి విమర్శలునవసరమే, కాదనలేము. కానీ రాజకీయ విమర్శ గిరి గీసినట్టు వాటికే పరిమితమవ్వడం సరిపోదు. కాషాయ పార్టీ సైద్ధాంతిక మూలాల పైకివిమర్శను విస్తరించడానికి ప్రయత్నంచేయడం లేదు. బీజేపీ సరిగ్గా దీనికి భిన్నమైన పంధాను అనుసరిస్తోంది. అది కాంగ్రెస్ మూలాలమీద విమర్శనాస్త్రాలనుసంధిస్తోంది. కాంగ్రెస్ లకిక విధానాలను అపహాస్యం చేస్తుంది. కాంగ్రెస్ ఆచరించిన ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన, సామ్యవాద విధానాల్ని గేలి చేస్తుంది. కాఆంగ్రెస్ మతసామరస్య విధానాన్ని మైనారిటీలను గారాబం చెయ్యడమేనని ప్రచారం చేస్తుంది. ఇవాళ దేశమ్మెదుర్కొంటున్న సకల సమస్యలకూ జవహర్ లాల్ నెహ్రూ మొదలుకుని మన్మోహన్ సీంగ్ వరకు కేవలం కాంగ్రెస్ నాయకులే కారకులంటూ నిందిస్తుంది. పటేల్ వంటి పలువురు దివంగత కాంగ్రెస్ హేమాహేమీలను తనవారిగా చూపించుకుంటుంది. ఎన్నికల పరంగాను, సైద్ధాంతికంపరంగానూ కాంగ్రెస్ ను దేశరాజకీయ పొలిమేరల్లోకి తరిమేస్తోంది. కాంగ్రెస్ ఈ దాడిని ప్రతిఘటించలేకపోతోంది. 

ఇప్పుడు బహిరంగంగా నలుగురి కళ్ళల్లో పడే విధంగా సంఘపరివార్ చేసే కార్యకలాపాలను చూడ్డంలో పడి, అది నిశ్శబ్దంగా హంగూ ఆర్భాటంలేకుండా చేసే అసలు పనిని కాంగ్రెస్ గమనించలేకపోతోంది. ప్రజల మస్తిష్కాలలో విద్వేషాన్ని నింపి, సమాజంలో చీలికలు తెచ్చి, అసహనం పెంచే ప్రయత్నం ఆ సంస్థ నిరంతరం ఎన్నికలతో నేరుగా సంబంధం లేకుండా శ్రమకోర్చి చేసే పని. అదే బీజెపీ రాజకీయ వృక్ష మూలాలకు జవసత్వాలను సమకూర్చేది. కాంగ్రెస్ ఆ ప్రయత్నానికి విరుగుడుగా ఏమీ చేయలేకపోతోంది. కనీసం ప్రయత్నం కూడా లేదు. సంఘ్ పరివార్ తన రాజకీయ శకటాన్ని ఒకవైపు నుంచి సౌమ్యులైన సంస్కృత పండితులతోనూ మరొకవైపు నుంచి మూర్ఖపు దుండుగులతోనూకూడా ముందుకు నడిపించుకోగల శక్తి యుక్తులను సమకూర్చుకుంది. కాంగ్రెస్ రాజకీయ సౌధానికి భావజాల ఆలంబన ప్రస్తుతం లేదు. సమకూర్చుకోవడానికి ప్రయత్నమూ చేయడంలేదు. తన రాజకీయ లక్ష్యం కేవలం ఎన్నికల మీద దృష్టి పెడితే నెరవేరుతుంది అనే భ్రమలో ఉంది. భావి భారత స్వరూపం గురించి తన ఆలోచన ఏమిటో ప్రజలకి అర్ధమయ్యే రీతిలో వివరించి కాంగ్రెస్ చెప్పలేకపోతే రాజకీయ సమరం అసమాన శక్తులమధ్యే జరుగుతుంది. ఈ పోరాటం రెండు సిద్ధాంతాల మధ్య, రెండు పరస్పర విరుద్ధ విశ్వదర్శనాల మధ్య జరిగే సంఘర్షణగా కాంగ్రెస్ ఇప్పటికైనా గుర్తించాలి. ఈ సవాలును గుర్తించి స్వీకరించకుండా ఉన్నంతకాలం ఎన్నికలలో దానికి లభించే విజయాలు కేవలం యాదృఛ్ఛికమే అవుతాయి. ఎక్కువ కాలం నిలవవు కూడా. కాంగ్రెస్ ఇలాగే ఉంటే, మానవీయ, సామరస్యపూర్వక, శాస్త్రీయ, లౌకిక, భిన్నత్వం తో విరాజిల్లే భారతాన్ని కాంగ్రెస్ బీజెపీ సంఘ పరివార్ చేసే దాడినుండి కాపాడలేదు. అటువంటి భారతాన్ని కోరుకునేవారు అశ్రు నయనాలతో మరొక రాజకీయ శక్తి కోసం తమ అన్వేషణను ప్రారంభించక తప్పదు. కాంగ్రెస్ ఈ లక్ష్యాన్ని స్వీకరిస్తుందా లేక చరిత్రలో ఒక పాత అధ్యాయంగా మిగిలిపోతుందా అనేది ఆ పార్టీ నాయకత్వం ముందున్న ప్రశ్న.

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin