parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.బట్టలు ఇలా కొనుక్కునేవాళ్ళం!

11-11-2019published_dt 2019-11-11T19:52:23.550Z12-11-2019 01:22:23 IST
2019-11-11T19:52:23.550Z11-11-2019 2019-11-11T19:52:23.550Z - - 04-10-2022

 

రోజూలాగే ఈవాళ కూడా ఆఫీసుకి బయలుదేరేముందు అమ్మదగ్గర కూర్చున్నాను. ఎల్లుండి దీపావళి. చిన్నప్పట్నుంచీ ఇంట్లో దీపావళి చాలా బాగా జరిగేది. నాన్నగారికి చాలా ఇష్టమైన పండుగ. ఆనాటి విషయాలు గుర్తుచేసుకోవడం మొదలు పెట్టింది. ఒకొక్కటీ చెప్పుకొస్తూ, ‘అన్నట్టు కొత్తబట్టలు కుట్టించుకున్నావా?’ అంది. ఉన్నాయి అన్నాను. సరిగా వినిపించుకోలేదు. ‘లేకపోతే డబ్బులిస్తాను వెళ్ళి బట్ట తీసుకుని మిషన్ మీద ఇవ్వు, తొందరగా కుట్టమను తెలిసిన టైలర్ కి ఇచ్చి’ అంది. 

 

బట్ట తీసుకుని మిషన్ మీద ఇవ్వాలట!  

 

బట్ట తీసుకోవడం, మిషన్ మీద ఇవ్వడం - ఈ మాటలు మన జీవితాల్లోంచి వెళ్ళిపోయి ఎన్నాళ్ళయిపోయిందో!  

 

పండగలకీ, పుట్టిన రోజులకి, ఇంట్లో పెళ్ళిళ్ళయినప్పుడూ కొత్తబట్టలు కుట్టించేవాళ్ళు. బట్టలు కుట్టించుకోవడం అంటే పెద్ద తతంగం. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా బట్టల కొట్టుకి మమ్మల్ని  కూడాపెట్టుకుని తీసికెళ్ళేవాళ్ళు. ఊళ్ళో చాలా బట్టల కొట్లున్నా, ఒక్కో కుటుంబానికీ ఒక్కో కొట్లో అలవాటు ఉండేది. ఇప్పటిలా మొహమాటాల్లేకుండా ముక్కూమొహం తెలీని పది కొట్లు తిరిగి ఎక్కడ నచ్చితే అక్కడ బట్టలు  కొనుక్కునే పద్ధతి ఉండేది కాదు మాకు. తెలిసిన వాళ్ళ కొట్టుకి వెళ్ళడమే. అక్కడున్నవాటిల్లో నచ్చినవి కొనుక్కోడమే. 

 

షాపులు కిటకిటలాడేవి కావు. పండుగలప్పుడు కొంచెం హడావిడి ఉండేదేమో. పుట్టిన రోజులప్పుడు మన ఒక్కరికేగా పండుగ, ఊళ్ళో వారికి ఏముంటుంది హడావిడి? షాపు వాళ్ళు తీరుబడిగా ఉండేవాళ్ళు.  మనం వెళ్ళినప్పుడు మనమే ఉండే వాళ్ళం. వాళ్ళ శ్రద్ధ అంతా మనమీదే ఉండేది.  

 

బట్టల కోట్లలో షర్టింగ్ సెక్షన్, సూటింగ్ సెక్షన్ అని రెండు ఉండేవి. షర్టింగ్ అంటే తెలిసేది గాని, ఆ సూటింగ్ ఏమిటో తెలిసేది కాదు. నిక్కరు గుడ్డని, పాంటు గుడ్డనీ సూటింగ్ అని ఎందుకనేవారో అస్సలు అర్ధమయ్యేదికాదు.  

 

తానులు తానులుగా బట్ట గోడల్లోకి అమర్చిన అల్మైరాల్లో ఉండేది. ఇంచుమించు ఒక లాంటి రంగు, నాణ్యత, లేక ధర ఉన్నవన్నీ ఒక చోట ఉండేవనుకుంటా. మరి లేకపోతే కొన్నింటిని ఒక అల్మైరాలోనూ, మరికొన్ని పక్క దాన్లోనో, కొంచెం దూరంలోనో పెట్టడానికి మరో కారణం నాకేమీ తట్టడం లేదు ఇప్పుడు కూడా.  

 

మా బావనో, మావయ్యనో, లేకపోతే కాలేజీలో చదువుతున్న మా పెద్దమ్మ కొడుకునో మాతో పంపించేది మా అమ్మ.  వాళ్ళు మమ్మల్ని కూడాపెట్టుకుని బట్టల కొట్టుకి తీసుకేళ్ళేవారు. మా అమ్మ దృష్టిలో వాళ్ళు ఎక్స్పర్ట్ సెలెక్టర్లనమాట. షాపు వాడు అరలోంచి బట్టలతాను తీసి కౌంటర్ బల్లమీద ఆ బట్టని పరిచే తీరు నేను ఇప్పటికీ మర్చిపోలేను. గబగబా ఆ బట్టను తాను నుంచి వలుస్తున్నట్టుగా తీస్తున్నప్పుడు దబా, దబా అంటూ అది చేసే శబ్దం, గుడ్డ విప్పుతూ దాన్ని కౌంటర్ మీద పరుస్తున్నప్పుడు షాపువాడి చేతుల వొడుపూ చాలా ఆకర్షణీయంగా ఉండేవి. నాకు కూడా అలా షాపువాడిలా చెయ్యడం వస్తే బాగుంటుందని రహస్యంగా కోరుకునేవాడిని. 

 

ఇక నన్ను తీసికెళ్ళిన ఎక్స్ పర్టులు గుడ్డ నాణ్యతని పరిశీలించే తీరు నాకు ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. గుడ్డని అరచేతిలోకి తీసుకుని, లేదా గుడ్డకింద అరచెయ్యి పెట్టి, రెండు వేళ్ళతో గుడ్డని నలిపేవారు. వాళ్ళకి ఏమి తెలిసేదో నాకైతే తెలిసేది కాదు కానీ, అబ్బే, నాణ్యత లేదు అన్నట్టుగా మొహం పెట్టేవారు. నాకు ఆ రంగు, డిజైనూ నచ్చి ఉండొచ్చు. కానీ ఏమి లాభం? వారి క్వాలిటీ టెస్ట్ ఫెయిల్ అయ్యిందిగా! ఈ ఎక్స్ పర్టుల వేళ్ళకి ఫర్వాలేదు అనిపించినవన్నీ ఒక పక్క పెట్టించేవారు. అది షార్ట్ లిస్ట్ అన్న మాట.  

 

అప్పుడు మొదలవుతాయి, సేల్స్ మాన్ చతురతా, అతని విన్యాసాలు. ఒక్కో గుడ్డనీ మడిచి మన ఒంటి మీద పెట్టేవాడు. అతని వెనకాల ఆల్మైరాల మధ్యలో అక్కడక్కడా అద్దాలు ఉండేవి. ఆ గుడ్డని మనం చొక్కా కుట్టించుకుంటే ఎలా వుంటుందో దాన్ని మన మీద పెట్టుకుని అద్దంలో చూసుకుంటే అలా ఉంటుందని ఊహించుకోవచ్చని అతని ఉద్దేశం. అతని ఇష్టాన్ని మన మీద రుద్దడానికి కొంత ప్రయత్నం చేసేవాడు. అలాగే మనల్ని కూడాపెట్టుకుని తీసికెళ్ళిన ఎక్స్ పర్ట్లు కూడా కొంత ప్రయత్నం చేసేవారు. వాళ్ళిద్దరి ఇష్టాల్నుంచీ  తప్పించుకుని మన ఇష్టాన్ని నెగ్గించుకోవడం ఆ వయసులో ఒక పెద్ద పని.

 

ఒక సారి చొక్కాగుడ్డ సెలెక్షన్ అయితే, అక్కణ్ణించి సీను సూటింగ్ ల సెక్షన్ కి మారేది. ఇక్కడ పని కొంచెం సులువు. ఎందుకంటే, మాచింగ్ మంత్రం ఉపయోగ పడుతుంది. మనం ఎంచుకున్న చొక్కా గుడ్డను పట్టుకుని పేంటు బట్ట ఉన్న అరలదగ్గరికెళ్ళి ఆ చొక్కా గుడ్డను పేంటు గుడ్డల మీదినుంచి వాటికి చూపిస్తూ జరుపేవాడు షాపువాడు. కొంచెం మాచింగ్ అనిపిస్తే, ఆ పేంటు గుడ్డ తానును బయటకు బయటకు లాగేవాడు. అలా కొన్ని లాగి ఒక షార్ట్ లిస్ట్ ఇక్కడ కూడా తయారు చేసేవాడు. మళ్ళీ మన ఎక్స్ పర్టుల నాణ్యతా పరిశీలన మొదలు. ఒక పేంటు గుడ్డ తానులోకి వేళ్ళు దోపడం, బట్టను నలపడం, తల అటూ ఇటూ తిప్పి లాభంలేదని తేల్చడం, వెంటనే మరో తానులోకి వేళ్ళు దూర్చడం, కాస్త ఫర్వాలేదనిపిస్తే తల కాస్త నిలువుగా పైకి కిందికీ ఊపి పక్కన పెట్టించడం. ఇలా మరో షార్ట్ లిస్ట్ అయ్యాక మళ్ళీ మన సేల్స్ మాన్ విన్యాసం. అతను ఆ పేంటు బట్టను పేంటు కాలిలాగ మడిచి చూపించేవాడు. దానిమీద మనం కొన్న చొక్కా గుడ్డను చొక్కా చేతిలాగ మడిచి రెండూ కలిపి వేసుకుంటే ఎలా వుంటుందో మనం ఊహించుకునేలా అక్కడ ప్రదర్శించేవాడు. అలా కొన్ని పేంటూ చొక్కాల జతలు ప్రదర్శించిన తర్వాత, ఎక్స్ పర్టుల సాయంతో మనం నిర్ణయించుకునేవాళ్ళం. సేల్స్ మాన్ మనచేత ఫలానాది కొనిపించాలని మొహమాట పెట్టడాన్ని, మన ఎక్స్ పర్టుల ఒత్తిడినీ తట్టుకుని మనకి నచ్చినవి కొనిపించుకోవడం అంత తేలికైన పని కాదు మాకు ఆ రోజుల్లో.  

 

నా చిన్నప్పుడు రెడీమేడ్ అంటే అందరికీ చాలా చిన్న చూపు ఉండేది. మా అమ్మ అయితే రెడీమేడ్ బట్టల్ని కొననిచ్చేది కాదు. ఆవిడ కారణం ఆవిడకి ఉండేది. జాయింటు కుట్ల దగ్గర కొంచెం ఎక్కువ గుడ్డ ఉంచరు రెడీమేడ్ వాళ్ళు. మరీ పిసినారిగా ఉంటారు, ఎదిగే పిల్లల బట్టలకి అలా కచ్చు ఎక్కువ లేకపోతే సైజ్ చేయించుకోవడానికి ఉండదు. ఆరునెలలు సంవత్సరంలోపలే పిల్లల బట్టలు పొట్టయిపోతాయి అని ఆవిడ బలమైన అభిప్రాయం. అలాగే పెద్ద వాళ్ళకి కూడా కాస్త వొళ్ళొస్తే కుట్లు విప్పుకుని నడుము కాస్త వదులు చేయించుకోడనికి రెడీమేడ్ బట్టల్లో కుదరదు. లోపల కొంచెం కూడా గుడ్డ వదలడు అంటూండేది. ఇదే అభిప్రాయం సాధరణం గా అందరికీ ఉండేది కాబోలు, రెడీ మేడ్ బట్టలు పెద్దగా ఎవ్వరూ వాడే వారు కాదు. బట్టల కొట్లలో రెడీమేడ్ సెక్షన్ ఒక మూలకి చిన్నదిగా  ఉండేది. ఒకే ఒక మినహాయింపు, పసిపిల్లల ఫ్రాకులు, జుబ్బాలు, నిక్కర్లూను. అవి మాత్రం రెడీమేడ్ లోనే తీసుకునేవారు చాలామంది. రెడీమేడ్ బట్టలు తడిపి కుట్టరు, అందువల్ల ఒక్క రేవు వెయ్యగానే గుడ్డ లాగేసి అవి పొట్టయిపోతాయి అనే అభిప్రాయం ఉండేది కూడా. 

 

ఇలా బట్ట కొనుక్కోవడం అయ్యాక, సరాసరి బట్టల కొట్టు నుంచే టైలర్ దగ్గరికి తీసికెళ్ళేవారు. 

 

 

టైలర్ల  సంగతీ, వారికి ఆది ఇవ్వడం గురించీ, వాళ్ళు బట్టలు కుట్టడం, ఇదిగో అదిగో అంటూ పండగ రోజు వరకూ బట్టలు కుట్టివ్వకుండా ఒకటికి పదిసార్లు మమ్మల్ని తిప్పుకోవడం, వీటన్నింటి గురించీ మరోసారి రాస్తాను.

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin