parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.అమ్మ చీరల మమకారం

18-09-2019published_dt 2019-09-18T11:45:37.898Z18-09-2019 17:15:37 IST
Updated On 19-09-2019 16:40:28 ISTmodified_dt 2019-09-19T11:10:28.982ZUpdated On 19-09-20192019-09-18T11:45:37.898Z18-09-2019 2019-09-18T11:45:37.898Z - 2019-09-19T11:10:28.982Z - 19-09-2019

అమ్మకి బట్టలంటే చాలా మోజు. మొట్టమొదటినుంచీ. 
 
ఇప్పుడు ఆవిడకి ఎనభైతొమ్మిది నిండి తొంభై నడుస్తున్నాయి. ఈ వయసులో కూడా, ఇవాళ నువ్వు కట్టుకున్న చీరబాగుందే అమ్మా,  అంటే ఇంతమొహం చేసేసుకుంటుంది.  చీర తన మునివేళ్ళతో పట్టుకుని నలుపుతూ, నేతను తడుముతూ, ఇది వెంకటగిరి అనీ, ఇది గద్వాల అనీ, ఇది పోచంపల్లి అనీ, ఇది తేలిగ్గా ఉంటుంది వేసవిలో కట్టుకోడానికి బాగుంటుందనీ, దీని బార్డర్ బాగుంటుందనీ, ఇది ఇన్నేళ్ళయ్యాక కూడా రంగు వెలవలేదనీ తన చీరల చరిత్ర, వాటి పుట్టుపూర్వోత్తరాలు, వయసు చెప్పుకొస్తుంది. 
 
ఏ చీర ఎప్పుడు కొనుక్కుందో, ఎవరు పెట్టారో, ఏ సంవత్సరంలో పెట్టారో, ఏ సందర్భంలో పెట్టారో చెప్తుంది. అవన్నీ బాగా గుర్తు అమ్మకి. నిన్న మొన్న జరిగిన చాలా విషయాలు గుర్తుండవు కానీ, చీరల విషయంలో మాత్రం అమ్మ జ్ఞాపకశక్తి అమోఘం.
 
ఇది మేము కేరళ టూర్ కి వెళ్ళినప్పుడు నాన్నగారు కొన్నారు. ఇది అమ్మలు తెచ్చింది. ఇది అక్క ఇచ్చింది. ఇది పిన్ని పెట్టిందిరా. ఇది ఫలానా వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెళ్ళికి పెట్టారు. నేను వెళ్ళలేకపోయినా ఇంటికొచ్చి మరీ పెట్టి వెళ్ళారు, అంటుంది మురిసిపోతూ. ఇది చీరల షావుకారు దగ్గర తీసుకున్నాను అని గుర్తుచేసుకుంటుంది. మా అమ్మకి చీరాల నుండి ఒక షావుకారు చీరలు హైదరాబాదు తెచ్చి అమ్మేవాడు. నాలుగు చీరలు తీసుకుందామనుకున్న మా అమ్మను నెమ్మదిగా బెల్లించి ఓ పది చీరలుదాకా కొనిపించే చాకచక్యం ఉండేదాయనకి. మంచి మాటకారి. 
 
అమ్మ చీరలు చాలాళ్ళు మన్నేవి. పాత చీరలు పనివాళ్ళకో బంధువుల్లో కాస్త లేనివాళ్ళకో ఇచ్చేది. జరీచీరలు పాతవయిపోతే జరీ బార్డరు కత్తిరించి దాచేది. అప్పుడప్పుడూ అది కరగబెట్టి వెండి తీసేవాళ్ళు వచ్చేవాళ్ళు. మూటెడు బార్డర్లు దాచి ఉంచితే పావలా కాసంత వెండి కాబోలు వచ్చేది. అలా తీసినందుకు వాళ్ళు రూపాయో పాపాయో తీసుకునే వాళ్ళు. అయినా పాతగుడ్డల్లోంచి ఏదో కొంత మిగిల్చాం అన్న తృప్తి కలిగేది కాబోలు. అమ్మ ఆ వీసమెత్తు వెండి కూడా వదిలేది కాదు.
 
చీరకి మ్యాచింగ్ బ్లౌజులు అమ్మకి చాలా ముఖ్యం. స్నానానికి వెళ్ళేముందు తను కట్టుకోదలచిన చీర, దాని మ్యాచింగ్ జాకెట్టు బీరువాలోంచి తీసి మంచం మీద పెట్టుకుని మరీ బాత్ రూం లోకి వెడుతుంది. ఇప్పటికి కూడా. మ్యాచింగ్ జాకెట్టు దొరికేవరకూ బీరువా అంతా గాలించాల్సిందే. ఎంత సమయం పట్టినా పర్వాలేదు. రాజీ ప్రశ్నే లేదు. అమ్మకి నగల పిచ్చి లేదు. ఏదో మామూలుగా మధ్యతరగతి కుటుంబాలలో ఉండే నగానట్రా, వెండి కంచాలూ, గ్లాసులూ తప్ప పెద్దగా బంగారం వస్తువులు అమర్చుకుందామనే ధ్యాస ఎప్పుడూ లేదు ఆవిడకి. 
 
చీరల మీదికి అమ్మ మనసు ఎంతెలా లాగుతుందో తెలియజేసే ఒక ఉదంతం నాకు ఒకటి ఇప్పుడు  గుర్తుకొస్తోంది. అమ్మే చెప్పింది నాకు.
 
అమ్మ, నాన్నగారు మన్యం ప్రాంతంలో అజ్ఞాతవాసంలో ఉన్నప్పుటి మాట. అమ్మ పుట్టింటి తరపువాళ్ళ ఎవరింట్లోనో పెళ్ళో మరో శుభకార్యమో జరిగినప్పుడు వాళ్ళు నాలుగు చీరలు రహస్యంగా వీళ్ళు ఉంటున్న మారుమూల ఊరికి పంపించారట. సాయంత్రం నాన్నగారు ఇంటికి వచ్చాక అమ్మ మురిసిపోతూ నాలుగుచీరలూ మంచం మీద పరిచి చూపించిందట. నాన్నగారు అవి చూసి, ఇందులో నీకు నచ్చిన రెండు చీరలు ఉంచుకుని మిగతా రెండూ పక్కన పెట్టు, పార్టీకి ఇచ్చెయ్యాలి అన్నారట. అమ్మ హతాశురాలయ్యిందట. కానీ తప్పదుకదా, కమ్మూనిస్టుల క్రమశిక్షణ ఆ రోజుల్లో అలాంటిది మరి. 
 
సరే రెండు ఎంచుకుని, పక్కకు తీసి పెట్టిందట. ఒక్క క్షణంలో, ఏమండీ ఆ చిలకపచ్చ రంగుది కూడా బాగుందండీ అందట. నాన్నగారు వెంటనే ఆ చిలకపచ్చ రంగు చీర అమ్మ ఎంచుకున్న చీరలతో పెట్టి, అందులోంచి ఒకటి తీసి ఇటు పార్టీ కోసం పెట్టిన చీరల్లో పెట్టారట. మనం ఉంచుకోవాల్సినవి, పార్టీకి ఇవ్వాల్సినవి వాటి లెక్క లెక్కే. రెండు మనకూ, రెండు పార్టీకి. అందులోంచి ఒకటి తీస్తే ఇందులోంచి ఒకటి అందులోకి వెళ్ళాల్సిందే. నాన్నగారికి అమ్మ చీరల విషయంలోనూ ఆ లెక్కకి మినహాయింపు లేదు. 
 
ఇలాంటి ఉదంతాలు అమ్మ దగ్గర గంపెడు ఉంటాయి.
 
 
 
     
facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin